తెర్లాం (బొబ్బిలి): గ్రామ సచివాలయ వ్యవస్థ గ్రామీణ ప్రాంత ప్రజలకు వరంగా మారింది. ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన గర్భిణికి ఆరోగ్యశ్రీ కార్డు అవసరం కావడంతో అత్యవసరంగా రూపొందించి 8 గంటల వ్యవధిలో నేరుగా ఆస్పత్రికి రాత్రి 11 గంటల సమయంలో అందించిన ఉద్యోగులు అందరి ప్రశంసలు అందుకున్నారు. వివరాలివీ.. విజయనగరం జిల్లా తెర్లాం మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన పైల ధనలక్ష్మి ప్రసవం కోసం శ్రీకాకుళం జిల్లా రాజాంలోని కేర్ ఆస్పత్రిలో గురువారం ఉదయం చేరింది.
ఆమెకు ప్రసవం చేసేందుకు ఆరోగ్యశ్రీ కార్డు అవసరమని, దానిని వెంటనే తీసుకురావాలని అక్కడి వైద్యులు తెలిపారు. ధనలక్ష్మికి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడంతో కుటుంబ సభ్యులు విజయరాంపురం గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసి పరిస్థితిని సచివాలయ అధికారులకు తెలియజేశారు. స్పందించిన డిజిటల్ అసిస్టెంట్ కె.రామ్మోహన్ ఆరోగ్యశ్రీ కార్డును 8 గంటల వ్యవధిలో మంజూరు చేసి, దానిని గ్రామ వలంటీర్ వెంకటరమణతో కలిసి గురువారం రాత్రి 11 గంటల సమయంలో రాజాంలోని కేర్ ఆస్పత్రికి తీసుకొని వెళ్లి గర్భిణికి అందజేశారు. అత్యవసర సమయంలో ఆదుకున్న సచివాలయ అధికారులు, సిబ్బందికి ధనలక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీడీవో శంబంగి రామకృష్ణ సచివాలయ సిబ్బందిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment