terror threats
-
ఢిల్లీకి తప్పిన ఉగ్ర ముప్పు! ఆయుధాలతో చిక్కిన ఆరుగురు
కోల్‌కతా: స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ ఢిల్లీకి భారీ ఉగ్ర ముప్పు తప్పింది! ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తూ ఆరుగురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. పంద్రాగస్టు సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో భాగంగా ఆనంద్ విహార్ ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించిన వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏకంగా 2,000 పై చిలుకు తూటాలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇవి చాలావరకు విదేశాల నుంచి తెప్పించిన అత్యాధునిక తూటాలని తేల్చారు. నిందితులను యూపీలోని జౌన్‌పూర్‌కు చెందిన అజ్మల్ (20), రషీద్ అలియాస్ లలన్ (20), సద్దాం, ఢిల్లీకి చెందిన కమ్రాన్, రూర్కీకి చెందిన నాసిర్, డెహ్రాడూన్‌కు చెందిన పరీక్షిత్ నేగిగా గుర్తించారు. ఓ ఆటో డ్రైవర్ అందించిన సమాచారం మేరకు వీరిని పట్టుకున్నట్టు అదనపు పోలీస్ కమిషనర్ విక్రంజీత్‌సింగ్, డీసీపీ ప్రియాంక కశ్యప్ శుక్రవారం మీడియాకు చెప్పారు. ‘‘ఆనంద్ విహార్ బస్టాప్ వద్ద ఇద్దరు వ్యక్తులు భారీ బ్యాగులతో అనుమానాస్పదంగా ఉన్నట్టు 6న సాయంత్రం సమాచారం అందింది. దాంతో రంగంలోకి దిగి అజ్మల్ ఖాన్, రషీద్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం. వారి బ్యాగుల్లో తూటాలు దొరికాయి. లక్నోకు చేర్చాల్సిందిగా వాటిని డెహ్రాడూన్‌లోని ఓ వ్యక్తి వాటిని ఇచ్చినట్టు విచారణలో వెల్లడించారు. వీళ్లు గతంలో కనీసం నాలుగుసార్లు ఇలా ఆయుధాలను చేరవేసినట్టు తేలింది. వారి సమాచారం ఆధారంగా లక్నో, జౌన్పూర్ తదితర చోట్లMమిగతా నలుగురిని అదుపులోకి తీసుకున్నాం. నేగి డెహ్రాడూన్‌లో ఆయుధ డెన్ నిర్వహిస్తున్నాడు. చాలాకాలంగా ఆయుధాలు, మందుగుండు చేరవేశాడు. అనుమానం రాకుండా ఆయుధ రవాణాకు ఈ ముఠా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టునే వాడుకుంటోంది’’ అని వెల్లడించారు. ఉగ్ర కోణాన్నీ కొట్టిపారేయలేమన్నారు. మరోవైపు కోల్‌కతాలో ప్రఖ్యాత విక్టోరియా మెమోరియల్ హాల్, పరిసర ప్రాంతాలను డ్రోన్‌తో ఫొటోలు తీస్తున్న ఇద్దరు బంగ్లాదేశీలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని బంగ్లాదేశ్‌లోని రాజ్షాహీకి చెందిన వారిగా గుర్తించారు. కోర్టు వారిని ఆగస్టు 23 దాకా పోలీసు కస్టడీకి అప్పగించింది. ఆర్మీ తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయమైన ఫోర్ట్ విలియంకు విక్టోరియా హాల్ కూతవేటు దూరంలోనే ఉంటుంది! పతంగులపై నిషేధం స్వాతంత్య్ర వేడుకలు జరిగే చారిత్రక ఎర్రకోట ప్రాంతంలో సున్నిత ప్రాంతాలపై నిఘాను తీవ్రతరం చేశారు. ఆ పరిసరాల్లో శనివారం నుంచి సోమవారం దాకా పతంగులు, బెలూన్లు, డ్రోన్ల వంటివాటిని ఎగరేయడాన్ని నిషేధించారు. రాడార్లనూ రంగంలోకి దించారు. ఇప్పటికే ప్రకటించిన, మొదలైన పతంగుల పోటీలు తదితరాలను ఆగస్టు 15 సాయంత్రం నుంచి నిర్వహించుకోవాలని సూచించారు. -
'మలాలా స్కూల్‌ని పేల్చేస్తాం'
లండన్: బ్రిటన్ లోని ఎనిమిది పాఠశాలలను బాంబులతో పేల్చివేస్తామని ఉగ్రవాదులు సోమవారం బెదిరించారు. పాకిస్థానీ హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మలాలా యూసఫ్ జాయి చదువుతున్న స్కూల్ కూడా ఉగ్రవాద బెదిరింపులు వచ్చిన వాటిలో ఉంది. ఇంగ్లండ్ బిర్మింగ్ హామ్ లోని ఆరు స్కూళ్లు, స్కాట్లాండ్ గ్లాస్ గౌలోని రెండు పాఠశాలలను పేల్చివేస్తామని ఉగ్రవాదులు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఈ పాఠశాలల నుంచి విద్యార్థులను ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు. 18 ఏళ్ల మాలాలా ప్రస్తుతం బిర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతోంది. ఈ పాఠశాలతో పాటు మరో ఏడు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే బెదిరింపులు ఉత్తవేనని తనిఖీల అనంతరం పోలీసులు తేల్చారు. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకకపోవడంతో విద్యార్థులు తిరిగి తరగతి గదుల్లోకి వెళ్లేందుకు అనుమతించారు. గతకొన్నిరోజులుగా ఉత్తుత్తి బాంబు బెదిరింపు కాల్స్ బ్రిటన్ ను వణికిస్తున్నాయి. తాజా ఉగ్రవాద బెదిరింపులు కూడా ఉత్తివేనని పోలీసులు తేల్చారు. -
ఢిల్లీకి గగనతల దాడుల ముప్పు!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరానికి ఉగ్రవాదుల నుంచి తీవ్ర ముప్పు పొంచి ఉందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఐఎస్ఐఎస్ సహా పలు ఉగ్రవాద సంస్థలు ఢిల్లీలో దాడులకు పాల్పడే అవకాశముందని, డ్రోన్లు, మానవరహిత విమానాలు, పారామోటార్లతో దాడులు చేయవచ్చునని అప్రమత్తం చేసింది. ఢిల్లీలో అత్యంత భద్రతా ఉండే 15 కీలక ప్రాంతాల్లో ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని హోంశాఖ పేర్కొంది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. హస్తినలో ఉగ్రవాద దాడులను నిరోధించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలను చేపడుతున్నారు. అంతేకాకుండా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) 'అన్ఫ్రెండ్లీ'గా గుర్తించే ఏ ఎగిరే వస్తువునైనా (ఫ్లయింగ్ అబ్జెక్ట్) కూల్చేందుకు భద్రతా సంస్థలకు అనుమతి ఇచ్చారు. ఉగ్రవాదుల నుంచి తీవ్రస్థాయి ముప్పు ఉంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో నార్త్ బ్లాక్‌లో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఢిల్లీ పోలీసులు, సీఐఎస్ఎఫ్, పౌరవిమానాయాన మంత్రిత్వ శాఖ, ఐఏఎఫ్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఉగ్రవాద ముప్పును ఎదుర్కొనేందుకు, దాడులను తప్పికొట్టేందుకు తగిన సూచనలు ఇవ్వాలని ఈ సమావేశంలో హోంమంత్రిత్వశాఖ కోరిందని సమాచారం. ముఖ్యంగా ఢిల్లీలోని కీలక ప్రాంతాలైన ప్రధానమంత్రి నివాసం, రాష్ట్రపతి భవన్, ఉప రాష్ట్రపతి, హోంమంత్రి నివాసాలు, రాజ్‌పథ్ చుట్టపక్కల ప్రాంతాలు, ఇండియా గేట్, సీబీఐ, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ వంటి భద్రతా సంస్థల కార్యాలయాలున్న సీజీవో కాంప్లెక్స్ లకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. 'దేశంలోనే అత్యంత సున్నితమైన మెట్రో నగరం ఢిల్లీ. పలు ఉగ్రవాద సంస్థల నుంచి హస్తినకు ముప్పును ఎదుర్కొంటున్నది. గగనతలం నుంచి కూడా దాడుల ముప్పు పొంచి ఉన్నట్టు తాజాగా భద్రతా ఏజెన్సీలు నివేదికలు ఇవ్వడం.. కీలకాశంగా మారింది. దీంతో ఈ ముప్పును ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తున్నది' అని సీనియర్ అధికారి ఒకరు ఓ మీడియా సంస్థకు తెలిపారు. ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో తమిళనాడుతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.