ఢిల్లీకి గగనతల దాడుల ముప్పు!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరానికి ఉగ్రవాదుల నుంచి తీవ్ర ముప్పు పొంచి ఉందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఐఎస్ఐఎస్ సహా పలు ఉగ్రవాద సంస్థలు ఢిల్లీలో దాడులకు పాల్పడే అవకాశముందని, డ్రోన్లు, మానవరహిత విమానాలు, పారామోటార్లతో దాడులు చేయవచ్చునని అప్రమత్తం చేసింది. ఢిల్లీలో అత్యంత భద్రతా ఉండే 15 కీలక ప్రాంతాల్లో ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని హోంశాఖ పేర్కొంది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. హస్తినలో ఉగ్రవాద దాడులను నిరోధించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలను చేపడుతున్నారు. అంతేకాకుండా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) 'అన్‌ఫ్రెండ్లీ'గా గుర్తించే ఏ ఎగిరే వస్తువునైనా (ఫ్లయింగ్ అబ్జెక్ట్) కూల్చేందుకు భద్రతా సంస్థలకు అనుమతి ఇచ్చారు.
ఉగ్రవాదుల నుంచి తీవ్రస్థాయి ముప్పు ఉంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో నార్త్ బ్లాక్‌లో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఢిల్లీ పోలీసులు, సీఐఎస్ఎఫ్, పౌరవిమానాయాన మంత్రిత్వ శాఖ, ఐఏఎఫ్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఉగ్రవాద ముప్పును ఎదుర్కొనేందుకు, దాడులను తప్పికొట్టేందుకు తగిన సూచనలు ఇవ్వాలని ఈ సమావేశంలో హోంమంత్రిత్వశాఖ కోరిందని సమాచారం. ముఖ్యంగా ఢిల్లీలోని కీలక ప్రాంతాలైన ప్రధానమంత్రి నివాసం, రాష్ట్రపతి భవన్, ఉప రాష్ట్రపతి, హోంమంత్రి నివాసాలు, రాజ్‌పథ్ చుట్టపక్కల ప్రాంతాలు, ఇండియా గేట్, సీబీఐ, సీఐఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్ వంటి భద్రతా సంస్థల కార్యాలయాలున్న సీజీవో కాంప్లెక్స్ లకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని కేంద్ర హోంశాఖ పేర్కొంది.
'దేశంలోనే అత్యంత సున్నితమైన మెట్రో నగరం ఢిల్లీ. పలు ఉగ్రవాద సంస్థల నుంచి హస్తినకు ముప్పును ఎదుర్కొంటున్నది. గగనతలం నుంచి కూడా దాడుల ముప్పు పొంచి ఉన్నట్టు తాజాగా భద్రతా ఏజెన్సీలు నివేదికలు ఇవ్వడం.. కీలకాశంగా మారింది. దీంతో ఈ ముప్పును ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తున్నది' అని సీనియర్ అధికారి ఒకరు ఓ మీడియా సంస్థకు తెలిపారు. ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో తమిళనాడుతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.