Test cricket series
-
భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు డ్రా
జొహన్నెస్‌బర్గ్: ఉత్కంఠభరితంగా సాగిన భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు డ్రాగా ముగిసింది. భారీ విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని దగ్గరగా వచ్చినప్పటికీ విజయాన్ని అందుకోలేపోయింది. చివర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సఫారీ టీమ్ అతిపెద్ద లక్ష్యాన్ని ఛేదించే అవకాశాన్ని కోల్పోయింది. టీమిండియా నిర్దేశించిన 458 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఛేధించే క్రమంలో దక్షిణాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయి 450 పరుగులు చేసింది. డీవిలియర్స్(103), డూఫ్లెసిస్(134) సెంచరీలతో చెలరేగడంతో సఫారీ జట్టు అతిపెద్ద లక్ష్యాన్ని ఛేదనకు చేరువగా వచ్చింది. 197 పరుగులకే నాలుగు వికెట్లు పడిన జట్టును వీరిద్దరూ సెంచరీలతో ఆదుకున్నారు. జట్టును గెలుపుబాటలోకి తీసుకొచ్చారు. 402 పరుగుల వద్ద డీవిలియర్స్ అవుటయ్యాడు. ఆ వెంటనే డుమిని(5) పెవిలియన్ చేరడంతో భారత్ శిబిరంలో ఆశలు రేగాయి. దక్షిణాఫ్రికా విజయం ఖాయమనుకున్న దశలో రహానే విసిరిన అద్భుతమైన త్రోకు ఫ్లెసిస్ రనౌట్ అయ్యాడు. చివరి ఓవర్లలో ధోని సేన సమిష్టిగా రాణించి ఆతిథ్య జట్టును కట్టడి చేసి మ్యాచ్ డ్రాగా ముగించింది. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు పడగొట్టాడు. జహీర్‌ఖాన్, ఇషాంత్ శర్మ చెరో వికెట్ తీశారు. విరాట్ కోహ్లికి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. -
గంటలోపు...11.4 ఓవర్లలో...
అడిలైడ్: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జోరుకు ఇంగ్లండ్ మరోసారి తలవంచింది. సోమవారం ఇక్కడ ముగిసిన రెండో టెస్టులో ఆసీస్ 218 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. 247/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ 11.4 ఓవర్లలో మరో 65 పరుగులు జోడించి 312 పరుగులకు ఆలౌటైంది. కీపర్ మాట్ ప్రయర్ (69) అర్ధ సెంచరీ సాధించినా లాభం లేకపోయింది. తాజా ఫలితంతో ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో ఆసీస్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. బ్రిస్బేన్‌లో జరిగిన తొలి టెస్టులోనూ కంగారూలు 381 పరుగులతో ఇంగ్లండ్‌ను ఓడించారు. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు శుక్రవారం నుంచి పెర్త్‌లో జరుగుతుంది. పోరాడిన ప్రయర్... నాలుగు వికెట్లు చేతిలో ఉన్న ఇంగ్లండ్ ఓటమిని తప్పించుకునేందుకు వర్షంపై ఆధార పడింది. ఉదయం జల్లులు కురిసి మ్యాచ్ ఆలస్యం కావడంతో ఆ జట్టులో ఆశలు చిగురించాయి. అయితే కొద్ది సేపటికే అంతా చక్కబడి మ్యాచ్ ప్రారంభమైంది. సిడిల్ వేసిన తొలి ఓవర్లోనే భారీ షాట్ ఆడబోయి బ్రాడ్ (29) వెనుదిరిగాడు. మరో వైపు ప్రయర్ బౌండరీలు బాదుతూ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే వరుస ఓవర్లలో స్వాన్ (6)ను హారిస్...ప్రయర్‌ను సిడిల్ అవుట్ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బ తీశారు. చివరకు హారిస్ బౌలింగ్‌లోనే షార్ట్ ఎక్స్ట్రా కవర్లో రోజర్స్‌కు పనేసర్ (0) క్యాచ్ ఇవ్వడంతో జట్టు పోరాటం ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను కుప్పకూల్చిన మిచెల్ జాన్సన్ (7/40)కు వరుసగా రెండో టెస్టులోనూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.