భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు డ్రా
జొహన్నెస్‌బర్గ్: ఉత్కంఠభరితంగా సాగిన భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు డ్రాగా ముగిసింది. భారీ విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని దగ్గరగా వచ్చినప్పటికీ విజయాన్ని అందుకోలేపోయింది. చివర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సఫారీ టీమ్ అతిపెద్ద లక్ష్యాన్ని ఛేదించే అవకాశాన్ని కోల్పోయింది. టీమిండియా నిర్దేశించిన 458 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఛేధించే క్రమంలో దక్షిణాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయి 450 పరుగులు చేసింది.
డీవిలియర్స్(103), డూఫ్లెసిస్(134) సెంచరీలతో చెలరేగడంతో సఫారీ జట్టు అతిపెద్ద లక్ష్యాన్ని ఛేదనకు చేరువగా వచ్చింది. 197 పరుగులకే నాలుగు వికెట్లు పడిన జట్టును వీరిద్దరూ సెంచరీలతో ఆదుకున్నారు. జట్టును గెలుపుబాటలోకి తీసుకొచ్చారు. 402 పరుగుల వద్ద డీవిలియర్స్ అవుటయ్యాడు. ఆ వెంటనే డుమిని(5) పెవిలియన్ చేరడంతో భారత్ శిబిరంలో ఆశలు రేగాయి. దక్షిణాఫ్రికా విజయం ఖాయమనుకున్న దశలో రహానే విసిరిన అద్భుతమైన త్రోకు ఫ్లెసిస్ రనౌట్ అయ్యాడు. చివరి ఓవర్లలో ధోని సేన సమిష్టిగా రాణించి ఆతిథ్య జట్టును కట్టడి చేసి మ్యాచ్ డ్రాగా ముగించింది. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు పడగొట్టాడు. జహీర్ఖాన్, ఇషాంత్ శర్మ చెరో వికెట్ తీశారు. విరాట్ కోహ్లికి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.