నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు
నిమిషం ఆలస్యమైనా నో... ఎంట్రీ
నేడు గుంటూరులోని 17 కేంద్రాల్లో ఎస్జీటీ పరీక్ష
అరగంట ముందుగా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి
మూడు రోజులు జరగనున్న టెట్ కం టీఆర్టీ
గుంటూరు ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి శనివారం నుంచి మూడు రోజుల పాటు ఉపాధ్యాయ అర్హత, నియామక పరీక్ష (టెట్ కం టీఆర్టీ)లు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు రాసేందుకు హాజరుకానున్న 33,380 మంది అభ్యర్థుల కోసం జిల్లా విద్యాశాఖ గుంటూరు నగరంలో 107 కేంద్రాలను సిద్ధం చేసింది. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, భాషా పండిట్, పీఈటీ కేటగిరీల వారీగా ఖాళీగా ఉన్న 951 పోస్టుల భర్తీకి సంబంధించి జరిగే పరీక్షలకు ఆయా కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్దేశిత సమయానికి కనీసం అరగంట ముందుగా అభ్యర్థులు కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని అధికారులు ప్రకటించారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 17 కేంద్రాల్లో జరగనున్న ఎస్జీటీ పరీక్షకు 3,520 మంది హాజరుకానున్నారు.
పరీక్ష కేంద్రాల్లో నిఘా..
పరీక్షల్లో మాల్ ప్రాక్టీసులు, అవకతవకలను నిరోధించేందుకు కేంద్రాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కేంద్రం వద్ద 100 మీటర్ల లోపు 144వ సెక్షన్ అమల్లో ఉంచడంతో పాటు సమీపంలోని జిరాక్స్ దుకాణాలను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు మూసి ఉంచాలని డీఈవో కేవీ శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. అభ్యర్థులు హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, ఇప్పటికే పొందిన హాల్ టికెట్లలో ఏమైనా తప్పులు ఉంటే కేంద్రాల్లోని నామినల్ రోల్స్ ఆధారంగా పొరపాట్లను సరిచేస్తారు.
హాల్ టికెట్లలో తప్పిదాలను ఆయా పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ల దృష్టికి తీసుకెళ్లి సరిచేసుకోవచ్చు. అదే విధంగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఏర్పాటు చేసిన 0863-2229107 నంబరు దృష్టికి తెచ్చి సలహాలు, సూచనలు పొందవచ్చని డీఈవో వివరించారు. అభ్యర్థులు హాల్ టికెట్, పెన్ను మినహా మరే ఇతర వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫోన్లను తమ వెంట తీసుకురాకూడదని స్పష్టం చేశారు.
పరీక్షల షెడ్యూల్..
9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 17 కేంద్రాల్లో జరిగే ఎస్జీటీ పరీక్షలకు 3,520 మంది హాజరుకానున్నారు.10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 16 కేంద్రాల్లో జరిగే భాషా పండిట్ పరీక్షలకు 3,401 మంది, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నాలుగు కేంద్రాల్లో జరిగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్షకు780 మంది హాజరుకానున్నారు.
11వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.15 వరకు 25 కేంద్రాల్లో జరగనున్న స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్) పరీక్షలకు 5,259 మంది, మధా ్యహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6.15 వరకు 90 కేంద్రాల్లో జరగనున్న స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజెస్) పరీక్షలకు 20,420 మంది హాజరుకానున్నారు.