ఆ నైతిక విలువలు ఏవి బాసు?
పశువులు సంతలో కొన్నట్టు కొంటారా...
ఒక ఎమ్మెల్సీ ముఖ్యం కాదు ... సిద్ధాంతం నాకు ముఖ్యం. ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలూ నియమాలకు కట్టుబడి ఉండాలి. ప్రజా జీవితంలో నేను నీతి, నిజాయతీగా బతికాను. ఆ విధంగా ముందుకు పోతాను. పశువులను సంతలో కొన్నట్టుగా ఎమ్మెల్యేలను కొంటారా...ఇదేనా ప్రజాస్వామ్యం. మూడు రోజుల కిందట మహా సంకల్ప సభలో చంద్రబాబు చెప్పిన మాటలు.
నైతిక విలువలకు తనదే పేటెంట్ హక్కు అన్నట్టుగా మాట్లాడుతున్న చంద్రబాసు వైఎస్సార్ సీపీ తరుపున గెలిచి జెడ్పీ పీఠాన్ని అధిష్టించిన నూకసాని బాలాజీని ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలోనే ముందస్తుగా తమ పార్టీలోకి చేర్పించుకోవడం ఏ సిద్ధాంతాలకు ప్రాతిపదిక. ఈ సమయంలో పశువుల సంతలు...కొనుగోళ్లు...బేరసారాలు... వలువలు ఊడిపోతున్న ప్రజాస్వామ్యం నారా సారుకు గుర్తుకు రావేమో. ‘కూతురు’ తప్పు గూట్లో దాచి కోడలు తప్పు ‘నట్టేట’ చాటిన చందంగా బాబు తీరు ఉందని జిల్లా ప్రజలే ఛీత్కరించుకుంటున్నారు.
నాడు
పార్టీని వీడే ప్రశ్నేలేదు
‘నేను విలువలతో కూడిన రాజకీయాలే చేస్తున్నాను. నాకు జిల్లా పరిషత్ అధ్యక్ష పదవి ముఖ్యం కాదు. అభివృద్ధిని సైతం రాజకీయాలతో ముడిపెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టడం నాకు నచ్చదు. నేను పార్టీని వీడే ప్రశ్నేలేదు... నాకు పదవిని కట్టబెట్టిన పార్టీలోనే కొనసాగుతా. ఒక వేళ పార్టీని వీడాల్సి వస్తే నాకు పార్టీ ద్వారా వచ్చిన అన్ని పదవులను త్యజించిన తరువాతే వెళ్తా...‘ ఇవి గత ఏడాది అక్టోబర్ 11న మొదటి జెడ్పీ సమావేశం ముగిసిన తరువాత అదే సమావేశం హాలులో జెడ్పీ ఛైర్మన్ నూకసాని బాలాజీ మీడియాతో మాట్లాడిన మాటలు.
నేడు
కోట్ల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి
ఓటుకు నోటు పేరుతో కేసీఆర్ మన రాష్ట్ర ముఖ్యమంత్రిని దారుణంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇది బాబుపై జరుగుతున్న కుట్ర. అందుకు నిరసనగానే వైఎస్సార్సీపీకి రాజీనామా చేశాను. ప్రస్తుతం జరుగుతున్నవన్నీ కోటీశ్వరుల చుట్టూ తిరుగుతున్న రాజకీయాలే కదా, ఓటుకు నోటు తప్పని ఎందుకు అనుకుంటారు. పార్టీకి సుశిక్షితులుగా పనిచేసిన వారికి కాకుండా ఎన్నికల సమయంలో కోటీశ్వరులకు సీట్లు ఇవ్వడమంటే దాని అర్థమేమిటి? డబ్బుకే ప్రాధాన్యతనిస్తున్నట్టు కదా..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : తాను విలువలకు కట్టుబడి ఉన్నానని, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ వస్తున్నానని పదేపదే చెబుతూ వచ్చిన జెడ్పీ ఛైర్మన్ నూకసాని బాలాజీ ఆ విలువలు వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీ గూటికి చేరడానికి సిద్ధమయ్యారు. బీసీ కార్పొరేషన్ పదవి ఇస్తామని తెలుగుదేశం నేతలు ఆశ చూపడంతో ఎమ్మెల్సీ ఎన్నికల ముందు గోడ దూకడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. గురువారం ఉదయం చంద్రబాబునాయుడి సమక్షంలో తెలుగుదేశం తీర్ధం పుచ్చుకుంటున్నట్లు ప్రకటించారు.
ఓసీకి కేటాయించిన జెడ్పీ ఛైర్మన్ పదవికి ఒక బీసీని ప్రతిపాదించిన వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఆయన గుడ్‌బై చెప్పారు. మెజారిటీ ఉన్నా తనను జెడ్పీ ఛైర్మన్ కాకుండా విశ్వప్రయత్నాలు చేసి జెడ్పీటీసీలను కొనుగోలు చేసి, వినని వారిని తప్పుడు కేసుల్లో అరెస్టు చేయించిన విషయాన్ని సైతం విస్మరించి అధికార పార్టీలోనే చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. జెడ్పీ ఛైర్మన్ హోదాలో ఏర్పాటు చేసిన మొదటి జెడ్పీ సమావేశంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు నూకసాని బాలాజీని ఇబ్బందిపెట్టే విధంగా వ్యవహరించడంతో ఆయన సీరియస్ అయ్యారు.
అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాను విలువలకు కట్టుబడి ఉన్నానని, ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ తాను వేరే పార్టీలోకి వెళ్తే ప్రస్తుతం ఉన్న పార్టీ ద్వారా వచ్చిన పదవులన్నీ వదులుకుంటానని తెగేసి చెప్పారు. ఆరు నెలలు గడిచేసరికి పరిస్థితిలో మార్పువచ్చింది. జెడ్పీ పదవిలో కొనసాగేందుకు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నిస్సిగ్గుగా ద్వారాలు తెరిచారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌ను రాత్రి సమయంలో కలిసి చర్చలు జరుపుతూ వచ్చారు. ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడిని కూడా కలిసి వచ్చారు.
అయితే తాను పార్టీలో చేరడం కోసం కాదని, జిల్లా అభివృద్ధి కోసమనంటూ బుకాయించారు. వేసవికాలంలో జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడి ఉన్న సమయంలో ఏర్పాటు చేసిన జెడ్పీ సమావేశానికి జిల్లా కలెక్టర్‌గాని, జెడ్పీ సీఈవో ఇతర ఉన్నతాధికారులు గైర్హాజరయ్యారు. కీలకమైన అధికారులు లేకుండా సమావేశం నిర్వహించడంలో అర్ధం లేదని భావించిన విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నుంచి బాయ్‌కాట్ చేసింది. దీన్ని అవకాశంగా తీసుకున్న బాలాజీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తి, తెలుగుదేశం నాయకులతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు.
తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు ముందుకు రావడంతో తెలుగుదేశం నాయకులతో చర్చలు జరిపారు. జెడ్పీ ఛైర్మన్ పదవిపై పార్టీ హామీ ఇవ్వలేదు. భవిష్యత్‌లో బీసీ కార్పొరేషన్ పదవిని ఇస్తామన్న హామీతో పార్టీ మారుతున్నట్లు సమాచారం. పదవి కోసమే పార్టీ మారుతున్నారా అన్న ప్రశ్నకు స్పష్టంగా సమాధానం ఇవ్వని నూకసాని, పదవినిస్తే ఎందుకు వద్దంటానని ఎదురు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మీరు పార్టీ మారడం కూడా ఓటుకు నోటుగానే భావించవచ్చా అని ప్రశ్నిస్తే తాను నిజాయతీ గల నాయకుడ్ని అంటూ చెప్పుకున్నారు. తాను జెడ్పీటీసీగా పోటీచేసినా, కందుకూరు ఎంఎల్ఏగా పోటీచేసినా పైసా ఖర్చుపెట్టకుండా గెలిచే సత్తా తనదంటూ మీడియాపై ఫైరయ్యారు.