texting
-
వారు 3 రెట్లు ఎక్కువ టైం తీసుకుంటున్నారట...!
సాక్షి, న్యూఢిల్లీ : ఫోన్లో మాట్లాడుతూ, మెసేజ్లు చేస్తూ వాహనాలు నడిపే వారు ప్రమాదాలను గుర్తించడానికి, అడ్డంకులను దాటడానికి 204 శాతం ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు ఒక ఐఐటీ బాంబే పరిశీలనలో తేలింది. దేశంలో జరిగే ప్రమాదాలకు ప్రధాన కారణాలు మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్ఫోన్ చూస్తూ వాహనాలు నడపడం. 2016 సంవత్సరానికి గాను రోడ్డు ప్రమాదాల బారిన పడి 2,138 మంది మరణించినట్లు రవాణా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక పరిశీలించిన అనంతరం ఈ ప్రమాదాలకు కారణాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఐఐటీ-బీ విద్యార్థులు వారి ఇనిస్టిట్యూట్ ఓ పరిశోధనను నిర్వహించారు. మూడు రకాల వయసులకు చెందిన 100 మంది లైసెన్స్ కలిగిన డ్రైవర్లను తమ పరిశోధన కోసం ఎన్నుకున్నారు. అనంతరం ఆ డ్రైవర్లందరిని ఐదు దశలల్లో దాదాపు 3.5 కి.మీ దూరం ప్రయాణం చేయించారు. మార్గమధ్యలో కొన్ని అడ్డంకులను ఏర్పాటు చేశారు. ఆగి వున్న వాహనం, ప్రమాదకరమైన మలుపులు వంటి వాటిని ఉంచారు. కొందరికి ఫోన్లు ఇచ్చి మాట్లాడుతూ వాహనం నడపమని చెప్పగా, మరికొందరిని మామాలుగా వాహనాలను నడపమని చెప్పారు. ఈ పరిశీలనలో అడ్డంకుల వచ్చిన సమయంలో వాటిని గమనించడానికి మాములుగా వాహనాలు నడుపుతున్న వారికంటే ఫోన్ వాడుతూ వాహనం నడుపుతున్నవారు 204 శాతం ఎక్కువ సమయాన్ని తీసుకున్నట్లు విద్యార్థులు గుర్తించారు. ఫోన్ వాడుతున్నవారిలో ఒక రకమైన బద్ధకం ఏర్పడి వారు తమ చుట్టూ జరుగుతున్న వాటిని పట్టించుకోక పోవడమే ఇలా జరగడానికి ప్రధాన కారణం. వారి దృష్టి అంతా ఫోన్ మీదనే ఉండటంతో ప్రమాదాలను, ముందస్తు హెచ్చరికలను గమనించడానికి మిగితా వారితో పోల్చినప్పుడు ఫోన్ మాట్లాడేవారు అధిక సమయాన్ని తీసుకుంటున్నారని తేలింది. -
డిన్నర్ సమయంలో ఒకే..!
స్మార్ట్ ఫోన్ల ఒరవడి పెరిగిన తర్వాత ప్రతి విషయం జనాన్ని భయపెడుతున్నాయి. ఫోన్ ఎక్కువగా మాట్లాడితే క్యాన్సర్లు వస్తాయని, బుద్ధిమాంద్యం సంక్రమిస్తుందంటూ కొందరు వైద్య పరమైన సమస్యలను వెల్లడిస్తుంటే... మరి కొందరు ఫోన్ మాట్లాడేందుకు, టెక్ట్స్ సంభాషణలకు కొన్ని సమయాలు మాత్రమే అనుకూలం అని చెప్తుంటారు. అయితే ఫోన్ సంభాషణలకు, టెక్స్ ఛాటింగ్ కు రాత్రి భోజన సమయం మంచిదేనంటున్నారు తాజా అధ్యయనకారులు. రాత్రి భోజన సమయంలో ఫోన్ మాట్లాడ్డం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవని పరిశోధకులు చెప్తున్నారు. బంధువులు, చుట్టాలనుంచి కాల్స్ వచ్చినా, సామాజిక మాధ్యమాల్లో ఛాటింగ్ చేసినా ఎటువంటి సమస్యలు ఉండవని చెప్తున్నారు. ముఖ్యంగా భోజనం చేస్తుండగా ఫోన్ వాడకం మంచిది కాదనే విషయంపై పరిశోధనలు నిర్వహించిన మిచిగన్ యూనివర్శిటీ పరిశోధక విద్యార్థి మోసర్.. భోజనం చేస్తూ కాండీక్రష్ వంటి గేమ్స్ ఆడటం, ఫేస్ బుక్ లో వచ్చిన వీడియోలు చూడటం వంటివి భిన్నమైనా... ఛాటింగ్, కాల్స్ వంటివి సమస్యలు తెస్తాయన్నది బూటకం అని తేల్చి చెప్పారు. ప్రపంచంలో ఇంగ్లీషు మాట్లాడే దేశాల్లోని సుమారు 8 నుంచి 88 ఏళ్ళ మధ్య వయసున్న 1,163 మంది పై పరిశోధనలు నిర్వహించారు. భోజన సమయంలో మొబైల్ వాడేవారి ఆలోచనలపై సర్వే నిర్వహించారు. వారు పనిచేసే రంగాన్నిబట్టి వారి ఆలోచనా విధానం ఆధారపడి ఉండటాన్ని గమనించారు. సామాజిక మాధ్యమాలను వినియోగించడంలో ఎక్కువ సమయం పట్టొచ్చని, భోజన సమయంలో మెసేజింగ్, ఫోన్ కాల్స్ చేయడంవల్ల పెద్దగా నష్టం ఉండదని తేల్చి చెప్పారు. చిన్నపిల్లలు ఎక్కువగా వారి మిత్రులతో సంభాషిస్తుంటారని, అదీ పగటి సమయంలోనే ఎక్కువగా ఉంటుందని సర్వేల్లో గమనించిన అధ్యయనకారులు... ముఖ్యంగా రాత్రి భోజన సమయంలో మధ్య వయస్కులే ఎక్కువగా ఫోన్ వినియోగిస్తున్నట్లు గమనించారు. దీంతో వారికి పెద్దగా నష్టం కలగదని తెలుసుకున్నారు. సాధారణంగా భోజన సమయంలో వార్తా పత్రికలు, పుస్తకాలు చదవడం, టీవీలు చూడటం పై ఎన్నో ఏళ్ళక్రితమే పరిశోధనలు జరిగాయని, ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ల ట్రెండ్ కొత్త సవాలుగా మారిందని సహ పరిశోధకురాలు, ప్రొఫెసర్ సరితా ఛోయెనెబెక్ తెలిపారు. ఫోన్ వాడే సమయంలో అర్జెంట్ కాల్స్ ను, మెయిల్స్ ను కూడ పట్టించుకుంటారో లేదో చెప్పలేమన్నారు. అయితే స్మార్ట్ ఫోన్ అభివృద్ధి పరిచేవారు మాత్రం పరికరాల్లో మరింత విజిబులిటీ పెంచాలని పరిశోధకులు సూచిస్తున్నారు. -
రోడ్డుపై నడుస్తూ మెసేజ్ లు చూసినా..
న్యూయార్క్: రోడ్లపై నడుస్తూ, డ్రైవింగ్ చేస్తూ ఫోన్లు మాట్లాడకూడదని ఆలా చేయడం నేరమని, ట్రాఫిక్ నిబంధనలకు సైతం విరుద్ధమని అమెరికాలో ఇప్పటికే చట్టాలు చేశారు. ఇకమీదట రోడ్లపై ఫోన్లో మెసేజ్ లు చూడటం, సందేశాలు టైప్ చేయడం వంటివి కూడ నేరంగానే పరిగణించబోతున్నారట. చట్ట వ్యతిరేక చర్యగా భావించి తగిన శిక్షను కూడ అమలు చేసే దిశగా ఆలోచిస్తున్నారు. 'డిస్ట్రాక్టెడ్ వాకింగ్' విశ్వవ్యాప్త సమస్యగా మారుతున్న నేటి తరుణంలో, సమస్యలపై నిపుణులు దృష్టిసారించారు. కదిలే సమయంలో ఫోన్ లోని చిన్నపాటి బ్లూ స్క్రీన్ చూడటంవల్ల కళ్ళకు తీవ్ర హాని కలగడంతోపాటు, ప్రమాదాలకు దారి తీయడాన్ని సీరియస్ గా తీసుకున్నారు. గ్లోబల్ మీడియా కంపెనీ మాషబుల్ లెక్కల ప్రకారం అమెరికాలో పాదచారుల మరణాలు రోజు రోజుకూ పెరుగుతున్నట్లు గమనించారు. పెడస్ట్రియన్ డెత్స్ 2005 లో 11శాతం ఉండగా.. ఆ సంఖ్య 2014 నాటికి 15 శాతానికి చేరుకున్నట్లు సర్వేలద్వారా తెలుసుకున్నారు. రోడ్ దాటుతున్నపుడు ఫోన్ వాడితే 250 డాలర్ల జరిమానా కట్టాలంటూ హవాయిలో రూపొందించిన బిల్లు పెండింగ్ లో ఉండగా... ఇప్పుడు రోడ్డుపై నడుస్తూ మేసేజ్ లు చేయడం కూడ చట్ట విరుద్ధంగా పరిగణించాలంటూ న్యూ జెర్సీలోని చట్టసభ సభ్యురాలు ఒకరు డిమాండ్ చేశారు. పాదచారులు ఫోన్లు వంటి కమ్యూనికేషన్ పరికరాల్లో మెసేజ్ లు చేయడం, సందేశాలను చూడటం వంటి చర్యలను పూర్తిగా నిషేధించాలని పమేలా లాంపిట్ డిమాండ్ చేశారు. చట్ట ఉల్లంఘనకు పాల్పడిన వారికి 50 డాలర్ల జరిమానాతోపాటు, 15 రోజుల జైలు శిక్షను కూడ అమలు చేయాలని ఆమె కోరారు. రోడ్లపై పరధ్యానంగా ఉండటం అటు డ్రైవర్లకు ఇటు ప్రయాణీకులకు ప్రమాదాలను తెచ్చిపెడుతుందన్నారు. వాహనాలు నడుపుతూ ఫోన్లు మాట్లాడటం వల్ల కలిగే నష్టమే, పరధ్యానంగా రోడ్లపై నడిచేవారివల్ల కలుగుతుందని, వారికి విధించినట్లే వీరికి కూడ జరిమానా విధించాలని లాంపిట్ డిమాండ్ చేశారు.