రోడ్డుపై నడుస్తూ మెసేజ్ లు చూసినా..
న్యూయార్క్: రోడ్లపై నడుస్తూ, డ్రైవింగ్ చేస్తూ ఫోన్లు మాట్లాడకూడదని ఆలా చేయడం నేరమని, ట్రాఫిక్ నిబంధనలకు సైతం విరుద్ధమని అమెరికాలో ఇప్పటికే చట్టాలు చేశారు. ఇకమీదట రోడ్లపై ఫోన్లో మెసేజ్ లు చూడటం, సందేశాలు టైప్ చేయడం వంటివి కూడ నేరంగానే పరిగణించబోతున్నారట. చట్ట వ్యతిరేక చర్యగా భావించి తగిన శిక్షను కూడ అమలు చేసే దిశగా ఆలోచిస్తున్నారు. 'డిస్ట్రాక్టెడ్ వాకింగ్' విశ్వవ్యాప్త సమస్యగా మారుతున్న నేటి తరుణంలో, సమస్యలపై నిపుణులు దృష్టిసారించారు. కదిలే సమయంలో ఫోన్ లోని చిన్నపాటి బ్లూ స్క్రీన్ చూడటంవల్ల కళ్ళకు తీవ్ర హాని కలగడంతోపాటు, ప్రమాదాలకు దారి తీయడాన్ని సీరియస్ గా తీసుకున్నారు.
గ్లోబల్ మీడియా కంపెనీ మాషబుల్ లెక్కల ప్రకారం అమెరికాలో పాదచారుల మరణాలు రోజు రోజుకూ పెరుగుతున్నట్లు గమనించారు. పెడస్ట్రియన్ డెత్స్ 2005 లో 11శాతం ఉండగా.. ఆ సంఖ్య 2014 నాటికి 15 శాతానికి చేరుకున్నట్లు సర్వేలద్వారా తెలుసుకున్నారు. రోడ్ దాటుతున్నపుడు ఫోన్ వాడితే 250 డాలర్ల జరిమానా కట్టాలంటూ హవాయిలో రూపొందించిన బిల్లు పెండింగ్ లో ఉండగా... ఇప్పుడు రోడ్డుపై నడుస్తూ మేసేజ్ లు చేయడం కూడ చట్ట విరుద్ధంగా పరిగణించాలంటూ న్యూ జెర్సీలోని చట్టసభ సభ్యురాలు ఒకరు డిమాండ్ చేశారు.
పాదచారులు ఫోన్లు వంటి కమ్యూనికేషన్ పరికరాల్లో మెసేజ్ లు చేయడం, సందేశాలను చూడటం వంటి చర్యలను పూర్తిగా నిషేధించాలని పమేలా లాంపిట్ డిమాండ్ చేశారు. చట్ట ఉల్లంఘనకు పాల్పడిన వారికి 50 డాలర్ల జరిమానాతోపాటు, 15 రోజుల జైలు శిక్షను కూడ అమలు చేయాలని ఆమె కోరారు. రోడ్లపై పరధ్యానంగా ఉండటం అటు డ్రైవర్లకు ఇటు ప్రయాణీకులకు ప్రమాదాలను తెచ్చిపెడుతుందన్నారు. వాహనాలు నడుపుతూ ఫోన్లు మాట్లాడటం వల్ల కలిగే నష్టమే, పరధ్యానంగా రోడ్లపై నడిచేవారివల్ల కలుగుతుందని, వారికి విధించినట్లే వీరికి కూడ జరిమానా విధించాలని లాంపిట్ డిమాండ్ చేశారు.