ఏసీలు లేకున్నా... 24 గంటలూ ఫుల్ ఏసీ!
అదొక అధునాతన హాస్టల్ భవనం... బయటి నుంచి ఒక్క యూనిట్ విద్యుత్తూ అందదు... కానీ వెలుగుజిలుగులకేం తీసిపోదు! ఏసీలు, కూలర్లు అసలే ఉండవు... అయినా ఫుల్ ఎయిర్ కండీషన్డ్! కాలం ఏదైనా బేఫికర్... కరెంటు పోతుందన్న భయమే లేదు! ఖర్చు పెరుగుతుందన్న బెంగ అసలే లేదు! ఎలా? ఎక్కడ? తెలుసుకుందాం...
విద్యుత్తు ఎలా ఉత్పత్తి అవుతుంది? నీరు, బొగ్గు, గ్యాస్, గాలి, సూర్యరశ్మితో, ఇంకా పలు రకాలుగా. వీటిలో బొగ్గు, గ్యాస్ వంటి సహజ వనరులు ఇంకా ఎంతకాలమని ఊరుతాయి? ఏదోనాటికి తప్పకుండా అయిపోతాయి. అవి అయిపోవడమే కాదు.. ఓజోన్ పొరకు చిల్లు కూడా భారీగానే పడుతుంది.
విలువైన నీరు కూడా వృథా అవుతుంటే మానవాళి దాహార్తితో అలమటించి చావాల్సిందే. మరి అప్పుడెలా? ఆ పరిస్థితి రాకముందే ఏం చేయాలి? అందుకు నిలువెత్తు సమాధానమే ‘రిట్రీట్’ హాస్టల్ భవనం. ఢిల్లీ సమీపంలోని గుర్గావ్లో గల గ్వాల్ పహాడీ వద్ద దీనిని ‘ద ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (టెరీ)’ నిర్మించింది. సూర్యర శ్మి, గాలి వంటి ఎప్పటికీ తరగని సుస్థిర వనరులను, వ్యర్థాలనే ఉపయోగించుకుని ఆధునిక టెక్నాలజీలకు దీటుగా అనేక సౌకర్యాలను పొందడంపై పరిశోధనలు నిర్వహించే ఈ సంస్థ తన లక్ష్యాలకు అనుగుణంగా సహజ ఎయిర్ కండీషనింగ్కి మార్గం చూపుతూ ఈ రిట్రీట్‌ని నిర్మించింది.
నేచురల్ ఏసీ ఇలా..!
రిట్రీట్ను సహజసిద్ధంగా చల్లగా ఉంచేందుకు ప్రత్యేక అండర్‌గ్రౌండ్ ఎర్త్ టన్నెల్స్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా భవనం వెలుపల ఓ టవర్ నిర్మించారు. దాని కిటికీల గుండా వాతావరణంలోని గాలి టవర్‌లోకి ప్రవేశిస్తుంది. టవర్ నుంచి కింద భూమిలో 4 మీటర్ల లోతులో నిర్మించిన 70 మీటర్ల పొడవాటి సన్నటి టన్నెల్ గుండా గాలి ప్రయాణిస్తుంది. అక్కడ చిన్న మోటార్ల సాయంతో గాలి పైకి ఏర్పాటు చేసిన గొట్టాల్లోకి, అక్కడి నుంచి నేరుగా చిన్న రంధ్రాల ద్వారా వివిధ గదుల్లోకి వెళుతుంది. టన్నెల్ భూమిలో 4 మీటర్ల లోతులో ఉండటం వల్ల అందులో ఉష్ణోగ్రత ఎప్పుడూ దాదాపుగా స్థిరంగా ఉంటుంది. ఏడాది పొడవునా 22 నుంచి 26 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత మాత్రమే ఉంటుంది. దాంతో గాలి కూడా చల్లబడి నివాస గదుల్లోకి వస్తుంది.
తర్వాత నివాస గదుల్లో వేడెక్కిన గాలి వె ళ్లేందుకు వెంటిలేటర్ల మాదిరిగా ప్రత్యేక గొట్టాలతో కూడిన మార్గం భవనం పై వరకూ ఉంటుంది. దాంతో వేడి గాలి భవనంపై నుంచి వెళ్లిపోవడం, గదిలోకి తిరిగి భవనం కింది నుంచి చల్లని గాలి రావడం జరుగుతుంది. ఇంకేం.. ఏసీలు, కూలర్లు లేకుండానే వాటికి దీటుగా గది అంతా ఫుల్ ఎయిర్ కండీషన్డ్ అయిపోతుంది. అయితే సహజ ఏసీ వ్యవస్థ వల్ల భవనంలో శీతాకాలంలో 20 డిగ్రీలు, ఎండాకాలంలో 28 డిగ్రీలు, వానాకాలంలో 30 డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత వరకూ ఉండవచ్చు. అవసరాన్ని బట్టి.. గాలిలో తేమను, వేడిని తగ్గించే ఎల్పీజీ, అమ్మోనియా ‘చిల్లర్స్’ పరికరాలను కాసేపు ఉపయోగించుకుంటే సరి.. ఏడాదంతా చౌకగానే ఏసీ అన్నమాట.
ప్రకృతి వనరులతో... ‘సుస్థిర’ భవనం!
తొమ్మిదేళ్ల క్రితం వరకూ ఎందుకూ పనికిరాని బంజరు భూమి అది. కానీ రిట్రీట్ నిర్మాణంతో ప్రస్తుతం సుస్థిర వనరులను ఎలా ఉపయోగించుకోవాలో తెలియచెప్పేందుకు వేదికగా మారింది. పరిసరాల్లో ప్రత్యేకంగా చెట్ల పెంపకం వల్ల, అండర్‌గ్రౌండ్ ఎయిర్టన్నెల్స్ వల్ల దాదాపు బిల్డింగ్ అంతా చల్లగా ఉంటుంది. ఆకురాలే చెట్లు నాటడం వల్ల వేసవిలో పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి. శీతాకాలంలో ఆ చెట్ల ఆకులు రాలిపోవడంతో కాస్త వెచ్చగా కూడా ఉంటుంది. ఇక విద్యుత్తు అవసరాలన్నీ పైకప్పుపై ఏర్పాటుచేసే ఫొటోవోల్టాయిక్ ప్యానెల్స్ ఒడిసిపట్టే సౌరవిద్యుత్ ద్వారానే తీరతాయి. వీటికి అదనంగా వంటచెరుకు, పంటల వ్యర్థాలను కాల్చి, వెలువడే వాయువులతో విద్యుత్‌ను తయారుచేసే గ్యాసిఫైర్ హైబ్రీడ్ ఎలక్ట్రిసిటీ ప్లాంటు కూడా ఉంది. ఒక్క సోలార్ ప్యానెల్స్‌తోనే 10 కిలోవాట్ల వరకూ విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. పగలు ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను నిల్వ చేసి రాత్రికి ఉపయోగించుకోవచ్చు. పైకప్పుపై నుంచి నేరుగా సూర్యరశ్మి గదుల్లోకి పడేలా ప్రత్యేక స్కైలైట్స్ ఉంటాయి కాబట్టి... పగలంతా లైట్ల అవసరమే ఉండదు. దీంతోపాటు తక్కువ విద్యుత్ కాలే బల్బులు, ఆటోమేటిక్ వ్యవస్థ కూడా ఉంటుంది.
మురుగు నీరూ.. ఉపయోగమే
హాస్టల్ గదుల నుంచి విడుదలయ్యే మురుగునీరంతా తొలుత ఓ ట్యాంకులోకి చేరుతుంది. అక్కడ ఘనవ్యర్థాలన్నీ ట్యాంకు అడుగున చేరి నీరు మాత్రమే ముందుకు ప్రవహిస్తుంది. ఘనవ్యర్థాలను సూక్ష్మజీవులు కుళ్లబెట్టి విచ్ఛిన్నం చేస్తాయి.
తర్వాత మిగిలే మురికి నీటిని ప్రత్యేకంగా రెల్లుగడ్డి మడిలోకి పంపుతారు. ఇంకేం.. గడ్డివేళ్లను, మట్టిని దాటుకుని అవతలికి చేరేసరికి నీరు దాదాపుగా శుభ్రమైపోతుంది. ఈ నీటిని తాగడానికి పనికిరాకున్నా.. సాగునీటిగా, ఇతర అవసరాలకు మాత్రం ఉపయోగించవచ్చు. నేలలో నీటి శాతమూ పెరుగుతుంది. మానవ వ్యర్థాలతో బయోమీథేన్ కూడా తయారుచేసి వాహనాలకు ఇంధనంగానూ వాడవచ్చు.
- హన్మిరెడ్డి యెద్దుల
రిట్రీట్ అంటే.. తిరోగమనం!
సైనిక పరిభాషలో రిట్రీట్ అంటే వెనక్కి తగ్గడం. ప్రమాదం ముంచుకొస్తుందని తెలిసినప్పుడు లేదా ఓడిపోయినప్పుడు రక్షించుకోవడం కోసం వెన్నుచూపడం. ఇప్పుడు మనిషికి కావల్సింది కూడా తిరోగమనమే. పునరుద్ధరింపలేని సహజ వనరుల విచ్చలవిడి వినియోగం నుంచి వెనక్కి మళ్లి ఎన్నటికీ తరిగిపోని సుస్థిర ఇంధన వనరుల వైపు సాగాల్సిన సమయమిది. అందుకే ఈ సంగతిని తెలియజెప్పేందుకే దీనికి రిట్రీట్ అన్న పేరు పెట్టారన్నమాట.
ఇలాంటి పద్ధతులపైనే దృష్టిపెట్టాలి...
సౌరశక్తి వినియోగంలో భారత్ నెంబర్ వన్ కావాలి. థర్మల్ విద్యుత్ కేంద్రాలు కాలుష్యాలను తగ్గించేలా ప్రస్తుతం మెరుగుపర్చాలి. తర్వాత దశలవారీగా వాటిని మూసేయాలి. ప్రతి విషయంలోనూ పాశ్చాత్య విధానాలను అనుసరించకుండా భారతీయులు ఇలాంటి పద్ధతులపై దృష్టిపెట్టాలి. అప్పుడే జల వనరులను కాలుష్యమయం చేయకుండా, అడవులను నాశనం చేయకుండానే దేశం అభివృద్ధి సాధిస్తుంది.
- ‘టెరీ’ డీజీ రాజేంద్ర కుమార్ పచౌరీ (2007లో నోబెల్ శాంతి బహుమతి పొందిన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ)కి చైర్మన్‌గా కూడా ఉన్నారు)
ఇవీ ప్రత్యేకతలు...
సాధారణ నిర్మాణ వ్యయం కంటే 25% అదనంగా ఖర్చు అయినా.. ఇతర భవనాల ఇంధనం ఖర్చుల్లో 50% వరకూ ఆదా అవుతుంది.
24 సోలార్ వాటర్ హీటింగ్ ప్యానెళ్ల ద్వారా రోజూ 2 వేల లీటర్ల నీరు వేడి చేసుకోవచ్చు.
రిట్రీట్ లాంటి ఓ భవనానికి వెలుగులు పంచాలంటే సుమారు 28 కిలోవాట్ల విద్యుత్ అవుతుంది. కానీ ప్రస్తుతం రిట్రీట్‌కు 10 కిలోవాట్ల విద్యుత్ మాత్రమే ఖర్చవుతోందట.
ఈ పద్ధతి వల్ల పెట్రోలియం, ఇతర వనరుల దిగుమతి తగ్గుతుంది కాబట్టి.. మారకద్రవ్యం రూపేణా విదేశాలకు భారీగా చెల్లించుకోవాల్సిన పరిస్థితి తప్పుతుంది.
రిట్రీట్‌లో ఏర్పాటు చేసుకున్న పర్యావరణ అనుకూల పద్ధతుల వ ల్ల ఏటా వాతావరణంలోకి ఎంత మేరకు సీవోటూ ఉద్గారాలు తగ్గుతాయో తెలుసా? అక్షరాలా 570 టన్నులు!