4 నుంచి టీజీటీ మెయిన్ పరీక్షలు
- పీజీటీ, పీడీలకు 29, 30 తేదీల్లో పరీక్షలు
- నేడు వెబ్సైట్లో ఫైనల్ కీ
- పీజీటీ, టీజీటీ, పీడీ లాంగ్వేజెస్ పరీక్షకు 75.34 శాతం హాజరు
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లోని 4,362 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) పోస్టులకు వచ్చే నెల 4 నుంచి 6 వరకు మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. టీజీటీ మ్యాథ్స్, బయలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్, సైన్స్ సబ్జెక్టులకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఏ సబ్జెక్టు వారికి ఏ తేదీలో పరీక్షలు ఉంటాయన్న వివరాలను గురు వారం(నేడు) తమ వెబ్సైట్లో అందుబాటు లో ఉంచుతామని వెల్లడించింది. అలాగే 921 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), 6 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఈ నెల 29, 30 తేదీల్లో మెయిన్ పరీక్షలు ఉంటాయని తెలి పింది. పీజీటీ మ్యాథ్స్, బయలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్, సైన్స్ సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలను, పీజీటీ, టీజీటీ, పీడీ స్క్రీనింగ్ టెస్ట్ ఫైనల్ కీలను గురువారం వెబ్సైట్లో ఉంచుతామని వెల్లడించింది.
ఫైనల్ కీపై ఎలాంటి అభ్యంతరాలు స్వీకరిం చేది లేదని స్పష్టం చేసింది. ఈ పోస్టులకు గత నెల 31న నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టు రాసేందుకు 2,62,670 మంది(పీజీటీ పోస్టు లకు 1,12,255 మంది, టీజీటీ పోస్టులకు 1,47,025 మంది, పీడీ పోస్టులకు 3,390 మంది) దరఖాస్తు చేసుకోగా 1,09,949 హాజరయ్యారని వివరించింది. కాగా, పీజీటీ, టీజీటీ, పీడీ లాంగ్వేజెస్ (తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం) పోస్టులకు బుధవారం నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టుకు 75.34 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. 51 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించగా.. 27,487 మంది హాజరైనట్లు వివరించింది.