మార్గదర్శి.. మహాత్మా పూలే: జోగు
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిరావుపూలే దేశానికి మార్గదర్శనం చేసిన మహనీయుడని బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న అన్నారు. పూలే జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ గడ్డం సాయికిరణ్ అధ్యక్షతన బుధవారం ఇక్కడ రవీంద్రభారతిలో పూలే 192వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జోగు రామన్న మాట్లాడుతూ సమాజంలో విలువలతో బతకాలన్నా, సంస్కారంతో ఉండాలన్నా విద్యతోనే సాధ్యపడుతుందన్నారు.
అణగారిన వర్గాల ఉన్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ మరొక పూలే అని కొనియాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.33 వేల కోట్లను కేటాయించిందన్నారు. కేసీఆర్ నిర్ణయం మేరకు వచ్చే జయంతికల్లా పూలే విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పుతామని హామీనిచ్చారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ మైనార్టీలకు ఎక్కువ సంఖ్యలో రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించడం గొప్ప విషయమన్నారు.
అన్ని వర్గాల ప్రజలకు కేసీఆర్ అండగా ఉంటూ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేసే ప్రయత్నంలో ఉన్నారని పేర్కొన్నారు. పశు సంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పూలే బడుగు, బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన యోధుడని, అందరికీ సమానహక్కులు ఉండాలని ఆకాంక్షించిన మహనీయుడని అన్నారు. ఒకప్పుడు దొరలకు, భూస్వాములకు మాత్రమే భూములెక్కువగా ఉండేవని, ప్రస్తుతం గ్రామాల్లోని రికార్డుల ప్రకారం అధికశాతం భూములు బీసీలకే ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల పక్షపాతి అని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ప్రవేశ పెడితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. బీసీలకు చట్టసభల్లో వాటా తెచ్చే విధంగా పోరాడితేనే పూలేకు ఘనమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ ముదిరాజ్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీసీ సంక్షేమశాఖ కమిషనర్ అనితారాజేంద్ర, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఉత్సవ కమిటీ కోఆర్డినేటర్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.