కాల్‌సెంటర్ క్యాబ్‌లలో జీపీఎస్ వ్యవస్థ
సాక్షి, ముంబై: కాల్‌సెంటర్ ఉద్యోగులను తరలించే అన్ని వాహనాలలో ఠాణే ట్రాఫిక్ పోలీసులు ట్రాకింగ్ పరికరాన్ని అమర్చనున్నారు. ఈ పరికరాన్ని అమర్చిన వాహనాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గోడ్బందర్ రోడ్ వద్ద సోమవారం ప్రారంభించనున్నారు. రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా ‘సురక్షితంగా ప్రయాణించు’ అన్న నినాదంతో ఠాణే ట్రాఫిక్ పోలీసులు ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. కాల్‌సెంటర్ క్యాబ్‌లలో జీపీఎస్ వ్యవస్థను అమర్చడం ద్వారా అందులే ప్రయాణించే మహిళలు వాహనం ఎక్కినప్పటి నుంచి గమ్యస్థానం చేరే వరకు ఈ వ్యవస్థ ట్రాకింగ్ చేస్తుంది.
ఈ వ్యవస్థ మహిళా ఉద్యోగుల తల్లిదండ్రులకు ఎంతో సహాయకరంగా ఉంటుందని ఠాణే ట్రాఫిక్ డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీస్ రష్మీ కరాండీకర్ అన్నారు. కాల్ సెంటర్ ఉద్యోగులను తరలించే అన్ని వాహనాలలో ఈ పరికరాన్ని అమర్చుతామన్నారు. ఈ విధానంలో మహిళా ఉద్యోగులకు ఓ చిప్‌ను అందజేస్తారు. ఆ చిప్‌లో సదరు ప్రయాణికురాలి వివరాలు, ఆమె ఐదుగురి బంధువుల ఫోన్ నెంబర్లు ఉంటాయి. వాహనంలో ప్రయాణం చేసే సమయంలో సదరు మహిళా ప్రయాణికురాలు ఆ చిప్‌ను పరికరంలో ఉంచాలి. దీంతో కుటుంటు సభ్యులు ఆమె ఎక్కడ ఉందన్న సమాచారం తెలుసుకోవచ్చు.