థ్యాంక్యూ పవన్ సార్..
ప్రతి ఏడాదీ వేసవిలో పవన్ కల్యాణ్ నుంచి కొంతమందికి ఓ పార్శిల్ అందుతుంది. అది మామిడిపళ్ల బుట్ట. ‘గబ్బర్‌సింగ్’ చిత్రంలోలా పాపిడి బిళ్లెట్టుకున్న అమ్మాయి ఈ మామిడి పళ్లను తీసుకురాదు కానీ, ఈ పళ్ల రుచి మాత్రం కెవ్వు కేక అట. పవన్ కల్యాణ్‌కి హైదరబాద్ శివార్లలో మామిడి తోట ఉంది. అందులో పండిన తాజా మామిడి పళ్లను ఆప్తులకు పంపిస్తుంటారు. ప్రతి ఏడాదీ ఈ పళ్లు అందుకుంటున్నవారిలో నితిన్ కూడా ఉన్నారు.
ఈ ఏడాది ఈ పార్శిల్ రాగానే ఆనందం పట్టలేక, కెవ్వు కేక పెట్టినంత పని చేశారట నితిన్. ‘‘పవర్‌స్టార్ ఈ ఏడాది కూడా నాకు మామిడిపళ్లు పంపించారు. చాలా రుచిగా ఉన్నాయి. థ్యాంక్యూ సార్’’ అంటూ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు.