thapovanam
-
ఐచర్ బీభత్సం
– 60 గొర్రెలు మృత్యువాత – త్రుటిలో తప్పించుకున్న కాపరులు – రూ.4 లక్షలకు పైగా ఆస్తి నష్టం అనంతపురం సెంట్రల్ : గొర్రెల మందపై ఐచర్ వాహనం దూసుకెళ్లి 60 గొర్రెల మృత్యువాత పడిన సంఘటన మంగళవారం రాత్రి నగరంలోని తపోవన సర్కిల్ సమీపంలో జరిగింది. సుమారు రూ.4 లక్షలు నష్టం వాటిల్లినట్టు కాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అదృష్టవశాత్తూ కాపరులు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వివరాలు.. ఆత్మకూరు మండలం ముట్టాల గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు పోతన్న, నారాయణ, వర్దనప్ప మేపు కోసం గొర్రెలతో నెలరోజుల క్రితం నార్పలకు వెళ్లారు. అయితే ఇటీవల కురిసిన తొలకరి వర్షాలతో స్వగ్రామంలో మేత దొరుకుతుందనే ఉద్దేశంతో తిరిగి వస్తుండగా మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో తపోవనం సమీపంలో రోడ్డు దాటుతున్న గొర్రెల మందపై బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఐచర్ వాహనం (కేఏ02 ఏఈ 0821) వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో సుమారు 60 గొర్రెలు మృతి చెందాయి. ఘటనలో కొన్ని గొర్రెలు రోడ్డుకే అతుక్కుపోయాయి. రూ. 4 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఐచర్ వాహనం అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని వివరించారు. ఘటన జరిగిన వెంటనే నాల్గో పట్టణ, ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఐచర్ వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. -
రూ.5.62 లక్షలు విలువైన ఎరువుల బస్తాలు సీజ్
అనంతపురం సెంట్రల్ : అనంతపురం తపోవనం సమీపంలోని సీడబ్యూహెచ్సీ గోదాముపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఇఫ్కో కంపెనీకి చెందిన 20–2–0–13 రకం ఎరువులు గడువు మీరిన వాటిని కొత్త సంచుల్లోకి మార్పిడి చేసి విక్రయించేందుకు యత్నిస్తుండగా పట్టుకున్నారు. మొత్తం 564 బస్తాలు సీజ్ చేయగా, వాటి విలువ సుమారు రూ. 5.62 లక్షలు ఉంటుందని అంచనా. రైతులను మోసగించాలనే దురుద్దేశంతో ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా ఎరువులను పాత సంచుల నుంచి కొత్త సంచుల్లోకి మార్పు చేస్తున్నట్లు తేలిందన్నారు. సదరు ఎరువులను శాంపిల్ తీసి అగ్రికల్చర్ ల్యాబ్‌కు పంపనున్నట్లు వెల్లడించారు. తదుపరి చర్య నిమిత్తం డిటెన్షన్ నోటీసు జారీ చేశామని చెప్పారు. తనిఖీలో విజిలెన్స్ సీఐ రెడ్డప్ప, అగ్రికల్చర్ ఆఫీసర్ ఉమాపతి, స్థానిక ఏఓ వాసుప్రకాశ్ పాల్గొన్నారు. -
'అనంత'లో కొనసాగుతున్న ఆందోళనలు
అనంతపురం: వేరు శెనగ విత్తనాలు పంపిణీ చేయాలంటూ అనంతపురం పట్టణంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ఉదయం అనంతపురం నగరంలోని తపోవనం వద్ద సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్ ఆధ్వర్యంలో 44వ నంబరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో బెంగళూరు - హైదరాబాద్ రహదారిలో కిలో మీటరు మేర వాహనాలు నిలిచి పోయాయి. అనంతరం కలెక్టరేట్ వద్ద సీపీఐ నేతలు ధర్నా నిర్వహిస్తున్నారు. వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేసేంత వరకు తమ దీక్షలు ఆపేది లేదని ఈ సందర్భంగా సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయంలో పోలీసులు కల్పించుకుని సీపీఐ జిల్లా అధ్యక్షుడు జగదీశ్ తో సహా 100 మంది సీపీఐ నేతలను అరెస్టు చేశారు.