సంకటహరుడుసదాశివుడు
ప్రతిమాసంలోనూ కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశికి ‘మాసశివరాత్రి’ అని పేరు. ఆనాడు శివునికి జరిపే అభిషేకాలు, అర్చనలు, విశేష ఫలాన్ని అనుగ్రహిస్తాయి. ఇటువంటి మాస శివరాత్రులు పన్నెండు మాసాలలోనూ పన్నెండు వస్తాయి. వానిలో మాఘ బహుళ చతుర్దశి నాటి శివరాత్రికి విశిష్టత అధికం. అందుకే దీనికి ‘మహాశివరాత్రి’ అని పేరు వచ్చింది. ఆరోజు చేసే పూజాభిషేకాలవల్ల కలిగే పుణ్యం అపరిమితంగా ఉంటుంది.
పద్ధెనిమిది పురాణాలలో పది పురాణాలు కేవలం శివుణ్ణే పరమదైవతంగా ప్రస్తుతిస్తే, మిగిలిన అందరు దేవతలకీ కలిపి ఎనిమిది పురాణాలే మిగిలాయని పరమశివాధిక్యాన్ని లెక్కగట్టి మరీ నిరూపించాడు మహాకవి శ్రీనాథుడు.
అభిషేకప్రియః శివః: శివునికి అభిషేకం అంటే ఎక్కువ ఇష్టం. అందుకే తలమీద గంగను ధరించాడేమో! విష్ణువుకి అలంకారం అంటే అధిక ప్రీతి. అందుకే వనమాలా కౌస్తుభరత్నాలు ధరించాడేమో! వాస్తవం పరిశీలిస్తే శివకేశవులకు ఏ విధమైన భేదం లేదనేదే మన పెద్దల సిద్ధాంతం. శివకేశవులే కాదు, బ్రహ్మకూడా వీరి తోటివాడే. అందుకే మహాకవి కాళిదాసు ఇలా అంటాడు. ఒక్క త్రిమూర్తుల విషయమే కాదు, సాత్త్వికుడైన శివభక్తుడు ఎవరు ఏ దేవతను ఉపాసించినా శివుణ్ణి ఉపాసించినట్లే భావిస్తాడు. అందుకే ‘శివ మహిమ్నా స్తోత్రం’లో పుష్పదంతుడు ఈవిధంగా చెప్పాడు: నదులన్నీ చివరికి ఏవిధంగా సముద్రంలో సంగమిస్తాయో, అలాగే మనుషులు వారి వారి సంస్కారాలను బట్టి దేనిని అనుసరించినా, వారి చివరి గమ్యం శివుడే!
లింగోద్భవకథ: ఒకసారి బ్రహ్మవిష్ణువులు ఒకచోట చేరి, ‘నేను గొప్ప అంటే నేను గొప్ప’ అని జబ్బలు చరుచుకున్నారు. అటువంటి సందర్భంలో వారి ముందు ఒక లింగం ఆవిర్భవించిందట. దాని ఆద్యంతాలు తెలుసుకొనడానికి హంసరూపంతో బ్రహ్మ ఊర్ధ్వముఖంగా పైకి, వరాహరూపంతో విష్ణువు అధోముఖంగా కిందికీ ప్రయాణం కట్టారట. ఎంతకాలం ఎంతదూరం సాగినా వారికి ఆ లింగం ఆద్యంతాలు అందలేదట. ఈవిధంగా శివుడు బ్రహ్మవిష్ణువుల అహంకారాన్ని అణచి, అటుపిమ్మట అనుగ్రహించాడట. ఆ శివలింగం ఏనాటి అర్ధరాత్రంలో ఆవిర్భవించిందో అది ‘మహా శివరాత్రి’గా వాడుక అయ్యిందట.
శివరాత్రి వ్రతం: ఈనాడు చేయవలసినది వ్రతకార్యం. శివరాత్రికి ముందురోజు ఒంటిపూట భోజనం చెయ్యాలి. శివరాత్రి నాడు తెల్లవారుజామునే లేచి, స్నానం, నిత్యం చేసుకునే సంధ్యావందనాది జపపూజాదులు పూర్తి చేసుకుని, పిమ్మట శివరాత్రి వ్రతాన్ని ఆచరించడానికి సంకల్పించాలి. దీనిని ఇంటివద్దగాని, దేవాలయంలోగాని చేయవచ్చు. ఇంటివద్ద చేసేటప్పుడు నవరత్నాలలో ఏదైనా ఒక రత్నంతోగాని, బంగారం, వెండి, రాగి, ఇత్తడి, ఇనుము, సీసం వంటి లోహాలతోగాని, మట్టితోగాని లింగాన్ని లేదా లింగాలను చేసి అర్చించవచ్చు.
ఈ అర్చన, అభిషేకాలు రాత్రివేళ నాలుగు జాములలోనూ చెయ్యాలి, అభిషేకానికి శుద్ధజలం, గంగోదకం, పంచామృతాలు తగినవి. పూజకు బిల్వదళాలు, తుమ్మి, ఉమ్మెత్త, గన్నేరు పువ్వులు మేలయినవి. ఈవిధంగా రాత్రి నాలుగు జాములలోనూ చేసి, జాగరణం ఉండి, ఆ మరునాడు మళ్లీ పూజచేసి, యథాశక్తి దానాలు చేసి, అన్నసంతర్పణ చెయ్యాలి. ఇలా చేస్తే సంసార క్లేశాలు తొలగిపోతాయి. పూర్వం కొందరు షట్కాలలోనూ శివపూజలు చేసేవారు. అలా నిత్యం కాకపోయినా, సంవత్సరానికి ఒకసారయినా, అదీ కాకపోతే జన్మలో ఒకసారి అయినా ఈ వ్రతాన్ని ఆచరించండి అని చెప్పడానికే జన్మానికో శివరాత్రి అనే వాడుక ఏర్పడి ఉంటుంది.
- డాక్టర్ ప్రభల సుబ్రహ్మణ్య శర్మ
అందుకే ఆ నియమాలు
ఈ వ్రతం చేసేటప్పుడు ఉపవాసం, జాగరణం, బ్రహ్మచర్యం అనే నియమాలు పాటించాలి. ఉపవాసం అంటే భోజనం చేయకుండా ఉండడం అనే అర్థం వాడుకలో ఉంది. అసలు అర్థం భగవంతుని మీద మనస్సు లగ్నం చెయ్యడం అని. మానవుణ్ణి లొంగదీసుకునేవి లోకంలో మూడు విషయాలు. అవి 1. ఆకలి. 2. నిద్ర 3. కామం. ఈ మూడింటికీ లోనుకాకుండా మనస్సును భగవంతుని మీదకు మళ్లించడం గొప్ప సాధన. ఆ సాధనలో ఉన్నత స్థితికి చేరుకోవడానికే ఉపవాసం, జాగరణం, బ్రహ్మచర్యం అనే నియమాలు ఈ వ్రతంలో ఏర్పడ్డాయి.
లింగతత్త్వం
‘లింగ్యతే జ్ఞాయతే అనేన ఇతి లింగం’ అని వ్యుత్పత్తి. పరమాత్మ తత్త్వం దీనివల్ల తెలుస్తుంది కనుక ఇది లింగమయ్యింది. వాస్తవానికి పరమాత్మకు రూపం లేదు. అందుకే లింగానికి కరచరణాది అవయవాలు ఉండవు. అయినప్పటికీ ఒక ఆకారం ఉంది కదా, అని ప్రశ్న. ఏదో ఒక విధమైన ఆకారం లేకపోతే భక్తుల ఉపాసనకు ఆలంబన లేకుండా పోతుంది కదా! అందుకే లింగానికి రూపం ఉందా అంటే ఉంది. లేదా అంటే లేదు. సగుణ నిర్గుణ తత్త్వాలకు వారధివంటిదన్నమాట.