నేడు నారసింహుడి తెప్పోత్సవం
ఆళ్లగడ్డ (కర్నూలు) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో శుక్రవారం తెల్లవారుజామున గరుడోత్సవం నిర్వహించారు. ఎగువ అహోబిలంలో జ్వాలా నరసింహస్వామి గరుడ వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. గరుడవాహనంపై స్వామి వారి ఉత్సవం నిర్వహిస్తున్నపుడు భక్తులు ఉత్సాహంతో వాహనం వెంట పరుగులు తీశారు. ఈ సందర్భంగా భక్తులు భారీగా ఎండు కొబ్బరి కాయలను కాల్చారు. ఈ బూడిదను భక్తులు ఇంటికి తీసుకుపోయి భద్రపరుచుకుంటారు. గరుడోత్సవంతో ఎగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. దిగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా తీర్థవారి చక్రస్నానం నిర్వహించారు.
స్వామి వారు తొమ్మిది రోజులపాటు బ్రహ్మోత్సవాల సమయంలో వాహనాలపై ఊరేగి చివరి రోజు ఆలయ సమీపంలోని కోనేటికి వేంచేశారు. అక్కడ నిత్య ఉత్సవమూర్తికి, స్వామివారి శఠారికి, సుదర్శన చక్రానికి నవకళాశాభిషేకం నిర్వహించారు. పుష్కరిణిలోకి గంగ,యమున, సరస్వతి నదులను ఆవాహనం చేసి పుణ్యవాచనం జరిపి మూడుసార్లు కోనేటిలో స్నానం చేయించారు. ఈ వేడుకల్లో 46 వపీఠాధిపతి శ్రీవన్ శఠగోపయతీంద్రమహదేశికన్, దేవస్థాన మేనేజర్ రామానుజన్, ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఆలయంలోని అద్దాల మండపంలో ప్రహ్లదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను బంగారు పీఠంపై కొలువుదీర్చి ద్వాదశారాధనం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో స్వామివారికి ఏర్పడిన శ్రమను తొలగించడానికి 12 రకాలైన పుష్పాలతో పుష్పయాగాన్ని వైభవంగా నిర్వహించారు. దిగువ అహోబిలంలో శనివారం తెల్లవారుజామున నిర్వహించే గరుడోత్సవంతో దిగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
నేటి నుంచి తెప్పోత్సవం:
బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత దిగువ అహోబిలంలోని కోనేరులో మూడురోజులపాటు తెప్పోత్సవం నిర్వహిస్తున్నట్లు దేవస్థాన మేనేజర్ రామానుజన్ తెలిపారు. శనివారం నుంచి మూడు రోజులపాటు తెప్పోత్సవం ఉంటుందని తెలిపారు.