Therefore
-
‘టెట్’ లీక్
కొప్పల ట్రెజరీ నుంచి ప్రశ్నాపత్రాలు మాయం ఒక్కొ పేపర్ రూ. లక్ష చొప్పున విక్రయం విశ్రాంత ఉపాధ్యాయుడితో సహా 13 మంది అరెస్ట్ పట్టుబడిన వారిలో పది మంది విద్యార్థులు బెంగళూరు : రాష్ట్ర వ్యాప్తంగా 694 కేంద్రాలలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టెట్) ఆదివారం జరిగాయి. పరీక్షలు జరగక ముందే బెంగళూరులో ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. ఇందుకు సంబంధించి కొప్పలకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు శివకుమార్ (65), అతని ఇద్దరుఅనుచరులతో సహ 13 మందిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం కొప్పల ట్రెజరీ నుంచి ప్రశ్నా పత్రాలు తీసుకు వచ్చి ఒక్కొక్కటి రూ. లక్ష చొప్పున విక్రయించారు. కచ్చితమైన వివరాలు సేకరించిన సీసీబీ పోలీసులు ఆదివారం వేకువ జామున నందిని లే అవుట్లో ఉంటున్న నిందితులను అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో పది మంది విద్యార్థులు ఉన్నారు. ప్రశ్న పత్రాలు లీక్ అయినా రాష్ట్ర వ్యాప్తంగా 694 కేంద్రాలలో 3.77 లక్ష మంది అర్హత పరీక్షలు రాశారు. పెద్దల ప్రమేయంతోనే... : ఔరాద్కర్ టెట్ ప్రశ్నాపత్రాల లీక్ వెనుక పెద్దల ప్రమేయం ఉందని, ఈ ముఠాను అరెస్టు చెయ్యడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి గాలిస్తున్నామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. టెట్ ప్రశ్నాపత్రాలు లీక్ అయిన కేసులో ఇప్పటికే శివకుమార్‌తో సహ 13 మందిని అరెస్టు చేసినట్లు ధ్రువీకరించారు. వీరిని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నట్లు చెప్పారు. ప్రశ్నా పత్రాలు లీక్ కావడానికి ప్రధాన కారకులు ఎవరు? ఈ దందాలో ఎంత మంది ఉన్నారు, ఎన్ని చోట్ల ప్రశ్నాపత్రాలు విక్రయించారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు వివరించారు. కాగా, గతంలో ప్రశ్నా పత్రాల లీక్ కేసులో శివకుమార్‌ను అరెస్టు అయ్యాడని గుర్తు చేశారు. అయితే ఇతను ఇలాంటి పరీక్షలు జరిగే సమయంలో చాకచక్యంగా ప్రశ్నాపత్రాలు చోరీ చేసి పెద్ద మొత్తంలో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడని తెలిపారు. శివకుమార్ వెనుక ఉన్న వారిని త్వరలో అరెస్టు చేస్తామని రాఘవేంద్ర ఔరాద్కర్ చెప్పారు. -
టెట్‌కు నిమిషం ఆలస్యమైనా అనుమతించం
చిత్తూరు(టౌన్), న్యూస్‌లైన్: తిరుపతిలో ఈ నెల 16వ తేదీ జరిగే టెట్ (ఉపాధ్యా య అర్హత పరీక్ష)కు నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్ష రాసేందుకు అనుమతించబోమని డీఈవో బి.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. పరీక్ష కోసం తిరుపతిలో 82 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 16 కేంద్రాల్లో, మధ్యాహ్నం 82 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని చెప్పారు. పరీక్ష ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు జరుగుతుందన్నారు. అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. శనివారం నుంచి ఒంటి పూట బడులు నిర్వహిస్తామని చెప్పారు. హోలీ సందర్భంగా ఈ నెల 17వ తేదీ స్కూళ్లకు సెలవు ప్రకటించామని చెప్పారు. -
కనువిందుగా కన్యాశుల్కం
=తొలి ప్రదర్శన మనోహరం =ఆకట్టుకున్న నటీనటులు =మూడు గంటలపాటు కట్టిపడేసిన నాటకం చోడవరం రూరల్, న్యూస్‌లైన్ : మహాకవి గురజాడ కలం నుంచి జాలువారి, శతాబ్దం తర్వాత కూడా సజీవంగా ఉన్న అజరామర నాటకం కన్యాశుల్కం ప్రేక్షకులను కట్టిపడేసింది. చోడవరం మండలంలో తొలిసారిగా ప్రదర్శితమైన సంక్షిప్త నాటకం వీక్షకులను రసవాహినిలో ఓలలాడించింది. కడుపుబ్బా నవ్వించింది. రంగస్థల నటులకు సవాలనదగ్గ ఈ నాటకంలో రాణించడంతో స్థానిక కళాకారుల సంతోషానికి అవధి లేకుండా పోయింది. గోవాడకు చెందిన లిఖిత సాయి క్రియేషన్స్ సంస్థ మొట్ట మొదటిసారిగా కన్యాశుల్కం నాటకాన్ని శనివారం రాత్రి ప్రదర్శించి శభాష్ అనిపించుకుంది. మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో పంచముఖాంజనేయ, వేణుగోపాల స్వామి ఆలయాల ద్వితీయ వార్షికోత్సవం సందర్బంగా ఈ ప్రదర్శన సాగింది. గోవాడకు చెందిన భాగవతులు ఉదయ్ కుమార్ దర్శకత్వంలో సాగిన ఈ నాటక ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. వణికించే చలిలో సైతం శనివారం రాత్రి 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ నాటకాన్ని తిలకించడం విశేషం. మన జిల్లాకే చెందిన మహాకవి గురజాడ రచించిన కన్యా శుల్కం నాటకం ఆధారంగా మూడు గంటల నిడివిలో ఈ ప్రదర్శన సాగింది. నాటకానికి ఆయువుపట్టయిన గిరీశం పాత్రలో ఉదయ్ కుమార్ ఆకట్టుకున్నారు. అతని శిష్యుడు వెంకటేశంగా బాల నటుడు వినయ్ రసవత్తరంగా నటించి రంజింపజేశాడు. సహజసిద్ధమైన రంగస్థలాంకరణ నాటకానికి మరింత కళ తెచ్చింది. ఏళ్లు గడిచినా గురజాడ కన్యాశుల్కానికి గల ఆదరణ తరగలేదని శనివారం మరోసారి రుజువైంది. ప్రేక్షకాదరణతో నాటక ప్రదర్శనపై నమ్మకం పెరిగిందని, ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చేందుకు సమాయత్తం అవుతామని లిఖిత సాయి క్రియేషన్స్ ప్రతినిధి జయంతి సతీష్ తెలిపారు. నాటకంలోని కళాకారులను కందర్ప గౌరీశంకర్ దంపతులు, గోవాడ సుగర్ ఫ్యాక్టరీ గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు కె. భాస్కరరావు, సమైక్యాంధ్ర జేఏసీ గోవాడ కన్వీనర్ ఎం.ఏ దేముడు, తదితరులు జ్ఞాపికలతో ప్రత్యేకంగా అభినందించారు. చాలా బాగుంది. కన్యాశుల్కం నాటక ప్రదర్శన చాలా బాగుంది. మొదటి ప్రయత్నంలోనే ఇంతలా విజయవంతం అవుతుందని అనుకోలేదు. ఈ నాటకంలో సుగర్ ఫ్యాక్టరీ కార్మికులు కూడా ఉండడం సంతోషం. వారికి అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తాం. - కె.భాస్కరరావు, గోవాడ సుగర్స్ గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు. విజయవంతమయింది ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా కేవలం నాటికల పోటీలనే ఏర్పాటు చేశాం. అయితే మొదటి ప్రదర్శనగా చేసిన కన్యాశుల్కం నాటకంతో వార్షికోత్సవం విజయవంతం అయినట్లయ్యింది. పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రేక్షకులే దీనికి నిదర్శనం. - వి. రామకృష్ణ, ఆలయ ధర్మకర్త. వెంకన్నపాలెం.