బడిలో పడ్డ దొంగలు
ఇబ్రహీంపట్నం రూరల్: వేసవి సెలవుల్లో భాగంగా తాళాలు వేసి ఉన్న పాఠశాలను దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. తాళాలు పగులగొట్టిన కార్యాలయం లోపల ఉన్న కంప్యూటర్, క్రీడా పరికరాలు, వంట సామాను ఎత్తుకుపోయారు.
బుధవారం నుంచి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అదేశాలు జారీ చేయడంతో.... ఇంచార్జ్ కిషన్ నాయక్ ఉదయం పాఠశాలకు వచ్చారు. తాళాలు, తలుపులు పగులగొట్టి కనిపించాయి. వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి సమాచారం అందించగా ఆదిబట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.