పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ఉధృతం
హైదరాబాద్ : కనీస వేతనాలు పెంపుతోపాటు 16 డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె ఉధృతమవుతోంది. ఫలితంగా జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రంలోని 17 నగర పురపాలక సంఘాలు, నగర పంచాయతీలపై సమ్మె ప్రభావం తీవ్రంగా ఉంది. పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారానికి మూడోరోజుకు చేరింది.
కార్మికులు విధులను బహిష్కరించడంతో చెత్త పేరుకుపోతోంది. ఇక సమ్మె విరమింపచేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ క్రమంలో రాష్ట్రమంత్రులు ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి కార్మిక సంఘాల ఐక్యవేదికతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు నేటి నుంచి జిల్లా డివిజన్స్థాయిల్లో ఆందోళన చేపడతామని జాయింట్ యాక్షన్ కమిటీ తెలిపింది.