వాహనదారులకు షాక్! ఇప్పుడు ఇవి కూడా పెంచేశారు!!
ధరల పెరుగుదల, పన్ను పోటు, సబ్సిడీల కోత, రాయితీలకు మూత.. ఇలాగే కొనసాగుతోంది కేంద్రం వ్యవహారం. అదుపు తప్పిన ద్రవ్యోల్బణంతో ఇప్పటికే బతుకుబండి లాగించడం కష్టంగా మారింది. పెట్రోలు, డీజిల్ ధరలు తలచుకుంటేనే కళ్లు బైర్లు కమ్ముతున్నాయ్.. ఇప్పుడున్నవి చాలవనీ మరో భారాన్ని వాహనదారులపై మోపింది కేంద్రం.
వెహికల్ ఏదైనా సరే ముందు జాగ్రత్తగా ఇన్సురెన్సు చేయించడం తప్పనిసరి చేశారు. అయితే ఇన్సురెన్సులో అనేక కేటగిరీలు ఉన్నా తక్కువ ప్రీమియంతో అందరికీ అందుబాటలో ఉండేది థర్డ్ పార్టీ ఇన్సురెన్స్. ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సరే వాహానదారులు థర్డ్ పార్టీ ఇన్సురెన్సును క్రమం తప్పకుండా చెల్లిస్తుంటారు. ఇప్పుడీ థర్డ్ పార్టీ ఇన్సురెన్సు చెల్లింపులను పెంచింది కేంద్రం. సవరించిన ధరలు 2022 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.
సవరించిన థర్డ్‌పార్టీ ఇన్సురెన్సు వివరాలు ఇలా ఉన్నాయి.
- 1000సీసీ ఇంజన్ సామర్థ్యం కలిగిన కార్లకు థర్డ్‌పార్టీ ఇన్సురెన్స్‌ను రూ.2,094గా నిర్ణయించారు. గతంలో 2019-20లో ఈ మొత్తం రూ.2,072గా ఉండేది
- 1000 నుంచి 1500 సీసీ ఇంజన్ సామర్థ్యం కలిగిన కార్లకు రూ.3,416గా థర్డ్‌పార్టీ ఇన్సురెన్సు అమల్లోకి రానుంది. గతంలో ఇది రూ.3,221కి పరిమితమైంది.
- చిత్రంగా బడాబాబులు ఎక్కువగా ఉపయోగించే 1500 సీసీ ఆపై సామర్థ్యం కలిగిన కార్లకు థర్డ్‌పార్టీ ఇన్సెరెన్సును రూ.7,890గా సవరించింది. గతంలో ఇది మరో రూ.7,897గా ఉండేది. ఈ ఒక్క కేటగిరీలోనే రూ.7 ప్రీమియం తగ్గింది.
- ఇక ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే 150 నుంచి 350 సీసీ వరకు థర్డ్‌పార్టీ ప్రీమియం రూ. 1,366గా నిర్ణయించారు. 350 సీసీ ఉన్న బైకులకు ఈ మొత్తం రూ.2,804గా ఉంది.
ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి
- ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించి 30 కిలోవాట్స్ సామర్థ్యం ఉంటే థర్డ్‌పార్టీ ఇన్సురెన్సు రూ.1,780గా నిర్ణయించారు. 30 నుంచి 65 కిలోవాట్స్ మధ్యన అయితే రూ.2,904గా ఉంది.
- కమర్షియల్ గూడ్స్ క్యారియర్లకు (12,000 కేజీల నుంచి 20,000 కేజీలు) సంబంధించి థర్డ్‌పార్టీ ప్రీమియంని రూ.35,313లకు పెంచారు. గతంలో ఇది రూ.33,414గా ఉండేది. ఇక 40 వేల కేజీలు దాటిన కమర్షియల్ వెహికల్స్‌కి రూ.44,242గా ప్రీమియం ఉంది.
కేంద్రం చేతుల్లోకి
గతంలో వాహనాల ఇన్సురెన్సులు విధివిధానాలను ఇన్సురెన్సు రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఐఏ) ఆధీనంలో ఉండేది. కాగా ఈసారి ఈ బాధ్యతలు కేంద్రం తీసుకుంది. ఈ మేరకు తొలిసారిగా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ థర్డ్ పార్టీ ఇన్సురెన్సుల సవరణ బాధ్యతలు తీసుకుంది.
చదవండి: మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు