దిగొచ్చిన థర్డ్ పార్టీ బీమా చార్జీలు
పెంచిన రేట్లను కొంత తగ్గిస్తూ ఐఆర్డీఏ ఆదేశాలు
న్యూఢిల్లీ: వాహన బీమా పాలసీల్లో థర్డ్ పార్టీ బీమా చార్జీలను భారీగా పెంచుతూ ఇటీవల తీసుకున్న నిర్ణయంలో మార్పులు జరిగాయి. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన రేట్లను కొంత మేర తగ్గిస్తూ బీమా నియంత్రణ సంస్థ(ఐఆర్డీఏ) తాజా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రక్కుల యజమానులకు ఉపశమనం లభించింది. సవరించిన థర్డ్ పార్టీ ప్రీమియం రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్టుగా ఐఆర్డీఏ తన ఆదేశాల్లో పేర్కొంది. వాస్తవానికి రేట్లను తగ్గించినప్పటికీ గతేడాదితో పోలిస్తే ప్రస్తుత రేట్లు కొంచెం ఎక్కువే.
తగ్గిన రేట్లు: 1,000 సీసీ నుంచి 1500 సీసీ వరకు కార్లపై థర్డ్ పార్టీ బీమా ప్రీమియం రూ.3,132 నుంచి రూ.2,863కు దిగొచ్చింది. 1500సీసీ కంటే అధిక సామర్థ్యం ఉన్న కార్లకు ప్రీమియం రూ.8,630 నుంచి రూ.7,890కు తగ్గింది. 1000 సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న కార్ల రేట్లలో మార్పులు లేవు. వీటికి ప్రీమియం రూ.2,055. ద్విచక్ర వాహనాల్లో 150సీసీ అంతకంటే ఎక్కువ సామర్థ్యంగల వాటి ప్రీమియం రేట్లూ తగ్గాయి. సరుకు రవాణా ట్రక్కులపై (40,000కిలోలు పైగా ఉన్నవి) ప్రీమియం రూ.36,120 నుంచి రూ.33,024కు తగ్గింది. లారీ, ట్రక్కుల యజమానులు థర్డ్ పార్టీ ప్రీమియం రేట్లను భారీగా పెంచడాన్ని నిరసిస్తూ ఇటీవల సమ్మె నిర్వహించిన విషయం విదితమే.