RDA
-
లైసెన్స్ కావాలా...మొక్క నాటండి
♦ కొత్త వాహనం రిజిస్ట్రేషన్‌కు రెండు మొక్కలు.. ♦ ఆర్టీఏ వినూత్న ప్రచారం ♦ హరితహారానికి ఊతం సాక్షి, సిటీబ్యూరో : డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, వివిధ రకాల పౌరసేవల కోసం వచ్చే వినియోగదారుల్లో హరితస్ఫూర్తిని నింపేందుకు ఆర్టీఏ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి వాహనదారుడు లెర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొనే సమయంలో తప్పనిసరిగా ఇంటి వద్ద ఒక మొక్కను నాటాలని, వాహనదారుడిగా తమ అనుభవంతో పాటే మొక్క కూడా పెరిగి పెద్దదవుతుందని, డ్రైవింగ్ లైసెన్స్‌కు గుర్తుగా ఉండిపోతుందని ఆర్టీఏ ప్రచారం చేపట్టింది. అలాగే ‘కొత్త వాహనం కొనుగోలు చేసిన సమయంలో తప్పకుండా రెండు మొక్కలు నాటండి. కొత్త వాహనం కొనుగోలు చేసిన మీ సంతోషం రెట్టింపవుతుంది.’ అని పేర్కొంటూ పోస్టర్లు, రేడియం స్టిక్కర్లను రవాణా అధికారులు విస్తృతంగా పంపిణీ చేస్తున్నారు. మరోవైపు స్కూల్ పిల్లలు తమ పుట్టిన రోజు సందర్భంగా ఒక మొక్కను నాటాలనే సందేశాన్నిస్తూ పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి సి.రమేష్ నేతృత్వంలో మెహదీపట్నంలోని గోల్కొండ కేంద్రీయ విద్యాలయం–2లో పెద్ద ఎత్తున హరితహారం చేపట్టారు. సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్, ఎంవీఐ టీవీ రావు, టీఎన్జీవోస్ తెలంగాణ రవాణా ఉద్యోగుల ఫోరమ్ ప్రధాన కార్యదర్శి సామ్యూల్‌పాల్ తదితరులు పాల్గొన్నారు. వందలాది మంది విద్యార్ధులతో కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రతి విద్యార్ధి తన పుట్టిన రోజు కానుకగా ఒక మొక్కను నాటాలని ప్రియాంక వర్గీస్ పిలుపునిచ్చారు. హరిత హారంపై వివిధ రూపాల్లో ప్రచారం చేపట్టిన ఆర్టీఏ కృషిని ఆమె అభినందించారు. ఆర్టీఏ రూపొందించిన రేడియం స్టిక్కర్లు, ప్రచార బ్రోచర్లను ఆవిష్కరించారు. -
దిగొచ్చిన థర్డ్ పార్టీ బీమా చార్జీలు
పెంచిన రేట్లను కొంత తగ్గిస్తూ ఐఆర్డీఏ ఆదేశాలు న్యూఢిల్లీ: వాహన బీమా పాలసీల్లో థర్డ్ పార్టీ బీమా చార్జీలను భారీగా పెంచుతూ ఇటీవల తీసుకున్న నిర్ణయంలో మార్పులు జరిగాయి. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన రేట్లను కొంత మేర తగ్గిస్తూ బీమా నియంత్రణ సంస్థ(ఐఆర్డీఏ) తాజా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రక్కుల యజమానులకు ఉపశమనం లభించింది. సవరించిన థర్డ్ పార్టీ ప్రీమియం రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్టుగా ఐఆర్డీఏ తన ఆదేశాల్లో పేర్కొంది. వాస్తవానికి రేట్లను తగ్గించినప్పటికీ గతేడాదితో పోలిస్తే ప్రస్తుత రేట్లు కొంచెం ఎక్కువే. తగ్గిన రేట్లు: 1,000 సీసీ నుంచి 1500 సీసీ వరకు కార్లపై థర్డ్ పార్టీ బీమా ప్రీమియం రూ.3,132 నుంచి రూ.2,863కు దిగొచ్చింది. 1500సీసీ కంటే అధిక సామర్థ్యం ఉన్న కార్లకు ప్రీమియం రూ.8,630 నుంచి రూ.7,890కు తగ్గింది. 1000 సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న కార్ల రేట్లలో మార్పులు లేవు. వీటికి ప్రీమియం రూ.2,055. ద్విచక్ర వాహనాల్లో 150సీసీ అంతకంటే ఎక్కువ సామర్థ్యంగల వాటి ప్రీమియం రేట్లూ తగ్గాయి. సరుకు రవాణా ట్రక్కులపై (40,000కిలోలు పైగా ఉన్నవి) ప్రీమియం రూ.36,120 నుంచి రూ.33,024కు తగ్గింది. లారీ, ట్రక్కుల యజమానులు థర్డ్ పార్టీ ప్రీమియం రేట్లను భారీగా పెంచడాన్ని నిరసిస్తూ ఇటీవల సమ్మె నిర్వహించిన విషయం విదితమే. -
మా భూములు ఇచ్చేది లేదు
భోగాపురం : ఎయిర్‌పోర్టుకి మా Cఇచ్చేదిలేదని ఆర్డీఓ వెంకటరావు ఎదుట రైతులు కరాఖండిగా చెప్పేశారు. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఆర్డీఓ వెంకటరావు స్థానిక నాయకులతో శనివారం సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం సుమారు 1.30 ప్రాంతంలో ఆయన భోగాపురం వచ్చారు. పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న వేదిక వద్ద కూర్చుని స్థానిక నాయకులకు కబురు పెట్టడంతో వారంతా కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఆయన ఎయిర్‌పోర్టు విషయం మాట్లాడకుండా చాకచక్యంగా ఉపాధి పనుల గురించి, పంచాయతీలో సమస్యల గుర్తించి ప్రస్తావించారు. వేదిక వద్దకు చేరుకున్న గ్రామస్తులు ఇదంతా ఎందుకు మీరు దేని గురించి వచ్చారో మాకు తెలుసు మేం ఎయిర్‌పోర్టుకి భూములిచ్చేది లేదని చెప్పారు. అయితే ఎయిర్‌పోర్టు గురించి తొందరపడనవసరంలేదు, ఇంకా జీఓ రాలేదు అని ఆర్డీఓ సమాధానం చెప్పారుు. జీఓ రాకుండా ఎందుకు గ్రామాల్లో వాల్ పోస్టర్లను అతికించేందుకు వీఆర్ఓలను పంపించారని నిలదీశారు. దీనికి ఆయన ఏ సమాధానం చెప్పలేదు. కొయ్యపేటకు చెందిన రైతు కొయ్య బంగార్రాజు మాట్లాడుతూ... నా కున్న భూమిని అమ్ముకుంటే ప్రభుత్వం ఇచ్చే ధరకంటే నాలుగురెట్లు ఇప్పుడే వస్తుంది, అయితే వ్యవసాయం చేసుకుని బతికేవాళ్ళం మా భూములను వదులుకోలేక అమ్మలేదు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటామంటే ఊరుకునేదిలేదని చెప్పాడు. అలాగే భోగాపురం ఈస్ట్‌లో 700 ఎకరాలు పోయే అవకాశం ఉందని, దీనిని మేం ఒప్పుకునేది లేదని స్థానిక నాయకులు స్పష్టం చేశారు. మీరు రమ్మంటే గౌరవంగా వచ్చామని, మీతో మాట్లాడినట్లు తెలిస్తే మా ప్రజలు ఊరుకోరని స్థానిక నాయకులు తెలిపారు. దీంతో ఆర్డీఓ అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు పడాల శ్రీనువాసరావు, ఉపసర్పంచ్ గుండాల మన్మధరావు, మాజీ ఉసర్పంచ్ కొమ్మూరు సుభూషణరావు, ఉదయబాబు, విశ్వేశ్వరరావు, రౌతు వాసు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మహిళా డ్రైవర్లకు అద్భుతభవిష్యత్తు
అవకాశాలను సద్వినియోగం చేసుకోండి 24న ఆర్టీఏలో స్క్రీనింగ్ టెస్ట్ ఆసక్తి గల వారికి ఆహ్వానం ‘సాక్షి’తో జేటీసీ రఘునాథ్ సిటీబ్యూరో: షీక్యాబ్స్ విధి విధానాలపై ఆర్టీఏ కసరత్తు చేపట్టింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 24న (బుధవారం) స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నారు. అనంతరం వారికి రహదారి భద్రతా నిబంధ నలకు అనుగుణంగా మరింత శిక్షణనిస్తారు. నగరంలో షీ క్యాబ్స్ నడిపేందుకు ఆసక్తి చూపుతూ ఇప్పటి వరకు 47 మంది మహిళా డ్రైవర్లు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించారు. హైదరాబాద్, రంగారెడ్డితో పాటు నల్లగొండ, మెదక్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల డ్రైవర్లు కూడా వీరిలో ఉన్నారు. రవాణా శాఖ అధికారులు దరఖాస్తులను పరిశీలించి, అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. స్క్రీనింగ్ పరీక్షలకు హాజరయ్యే మహిళా డ్రైవర్ల నైపుణ్యం, వాహనాలు నడపడంలో వారి అనుభవం, ఆసక్తి, ఎలాంటి వాహనాలను నడపగలరు వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని, అదే రోజు సాయంత్రం విధివిధానాలను రూపొందిస్తారు. బ్యాంకులు, ఇతర విభాగాల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారు. హైదరాబాద్‌లో ఇది మొట్టమొదటి ప్రాజెక్టు కాబట్టి లోపాలకు. వైఫల్యాలకు తావు లేకుండా, సమర్థంగా నిర్వహించేందుకు రవాణా శాఖ దృష్టి సారించింది. ఇందుకోసం ఇప్పటికే కేరళలోని త్రివేండ్రంలోని షీ క్యాబ్స్ ప్రాజెక్టును అధ్యయనం చేసిన అధికారులు అక్కడి కంటే విజయవంతంగా దీనిని నిర్వహించడంపై దృష్టి కేంద్రీకరించారు. వాహనాల కొనుగోలుతో పాటు, 35 శాతం ప్రభుత్వమే సబ్సీడీని అందజేయడంతో పాటు బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆసక్తి ఉన్న మహిళలకు అన్ని విధాలుగా బాసటగా నిలిచి శిక్షణతో పాటు, అవసరమైన వారికి వసతి సౌకర్యం కల్పించనున్నారు. ఆఖరు తేదీలు లేవు: రఘునాథ్, సంయుక్త రవాణా కమిషనర్ మహిళలు వాహనాలు నడపడం ఏ మాత్రం సమస్య కాబోదు. ఆసక్తి, అభిరుచి ఉంటే చాలు. రహదారులపై పరుగులు తీయవచ్చు. డ్రైవింగ్ వల్ల ఉపాధి లభిస్తుంది. మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆసక్తి ఉన్న మహిళా డ్రైవర్లు ఇంకా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఖరు తేదీలంటూ ఏమీ లేవు. హైదరాబాద్‌లో ఈ వృత్తిని స్వీకరించబోయే మహిళలు ఒక సామాజిక బాధ్యతను కూడా తమ భుజాన వేసుకోబోతున్నారు. తోటి మహిళల భద్రతకు తాము భరోసా ఇవ్వబోతున్నారు. ఆ రకంగా వారు విజయం సాధించాలని ఆశిస్తున్నాం. మహిళా డ్రైవర్లకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలను అంద జేస్తుంది.