మహిళా డ్రైవర్లకు అద్భుతభవిష్యత్తు
అవకాశాలను సద్వినియోగం చేసుకోండి
24న ఆర్టీఏలో స్క్రీనింగ్ టెస్ట్
ఆసక్తి గల వారికి ఆహ్వానం
‘సాక్షి’తో జేటీసీ రఘునాథ్
సిటీబ్యూరో: షీక్యాబ్స్ విధి విధానాలపై ఆర్టీఏ కసరత్తు చేపట్టింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 24న (బుధవారం) స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నారు. అనంతరం వారికి రహదారి భద్రతా నిబంధ నలకు అనుగుణంగా మరింత శిక్షణనిస్తారు. నగరంలో షీ క్యాబ్స్ నడిపేందుకు ఆసక్తి చూపుతూ ఇప్పటి వరకు 47 మంది మహిళా డ్రైవర్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించారు. హైదరాబాద్, రంగారెడ్డితో పాటు నల్లగొండ, మెదక్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల డ్రైవర్లు కూడా వీరిలో ఉన్నారు. రవాణా శాఖ అధికారులు దరఖాస్తులను పరిశీలించి, అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. స్క్రీనింగ్ పరీక్షలకు హాజరయ్యే మహిళా డ్రైవర్ల నైపుణ్యం, వాహనాలు నడపడంలో వారి అనుభవం, ఆసక్తి, ఎలాంటి వాహనాలను నడపగలరు వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని, అదే రోజు సాయంత్రం విధివిధానాలను రూపొందిస్తారు. బ్యాంకులు, ఇతర విభాగాల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారు.
హైదరాబాద్‌లో ఇది మొట్టమొదటి ప్రాజెక్టు కాబట్టి లోపాలకు. వైఫల్యాలకు తావు లేకుండా, సమర్థంగా నిర్వహించేందుకు రవాణా శాఖ దృష్టి సారించింది. ఇందుకోసం ఇప్పటికే కేరళలోని త్రివేండ్రంలోని షీ క్యాబ్స్ ప్రాజెక్టును అధ్యయనం చేసిన అధికారులు అక్కడి కంటే విజయవంతంగా దీనిని నిర్వహించడంపై దృష్టి కేంద్రీకరించారు. వాహనాల కొనుగోలుతో పాటు, 35 శాతం ప్రభుత్వమే సబ్సీడీని అందజేయడంతో పాటు బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆసక్తి ఉన్న మహిళలకు అన్ని విధాలుగా బాసటగా నిలిచి శిక్షణతో పాటు, అవసరమైన వారికి వసతి సౌకర్యం కల్పించనున్నారు.
ఆఖరు తేదీలు లేవు: రఘునాథ్, సంయుక్త రవాణా కమిషనర్
మహిళలు వాహనాలు నడపడం ఏ మాత్రం సమస్య కాబోదు. ఆసక్తి, అభిరుచి ఉంటే చాలు. రహదారులపై పరుగులు తీయవచ్చు. డ్రైవింగ్ వల్ల ఉపాధి లభిస్తుంది. మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆసక్తి ఉన్న మహిళా డ్రైవర్లు ఇంకా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఖరు తేదీలంటూ ఏమీ లేవు. హైదరాబాద్‌లో ఈ వృత్తిని స్వీకరించబోయే మహిళలు ఒక సామాజిక బాధ్యతను కూడా తమ భుజాన వేసుకోబోతున్నారు. తోటి మహిళల భద్రతకు తాము భరోసా ఇవ్వబోతున్నారు. ఆ రకంగా వారు విజయం సాధించాలని ఆశిస్తున్నాం. మహిళా డ్రైవర్లకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలను అంద జేస్తుంది.