క్యాన్సర్‌కు కళ్లెం.. గ్రామ, వార్డు క్లినిక్స్‌ స్థాయిలో స్క్రీనింగ్‌ | Cancer Screening at village and ward clinics level Screening test | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌కు కళ్లెం.. గ్రామ, వార్డు క్లినిక్స్‌ స్థాయిలో స్క్రీనింగ్‌

Published Mon, Aug 1 2022 4:40 AM | Last Updated on Mon, Aug 1 2022 2:36 PM

Cancer Screening at village and ward clinics level Screening test - Sakshi

సాక్షి, అమరావతి: మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్లతో విస్తరిస్తున్న క్యాన్సర్‌ కేసులను పసిగట్టి సరైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయి నుంచి ప్రణాళిక సిద్ధం చేసింది. గ్రామ, వార్డు క్లినిక్స్‌ స్థాయిలోనే క్యాన్సర్‌ కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించి అవగాహన కల్పించనున్నారు. ఈ మేరకు క్యాన్సర్‌ స్క్రీనింగ్‌పై సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. 

లైనాక్‌ మెషిన్లు, 3 చోట్ల సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లు
క్యాన్సర్‌ కేసుల్లో 60 – 70 శాతం వరకు చివరి దశలో గుర్తించడంతో వ్యయ ప్రయాసలతో చికిత్స పొందినా ఫలితం దక్కడం లేదు. విస్తృత స్క్రీనింగ్‌ ద్వారా ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స అందిస్తే చాలా ప్రాణాలను కాపాడవచ్చు. గ్రామ, వార్డు క్లినిక్స్‌తో పాటు మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు ద్వారా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను ప్రభుత్వం అమల్లోకి తేనుంది.

తద్వారా క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్సలు అందించనున్నారు. క్యాన్సర్‌ గుర్తింపు, చికిత్సపై సమర్థ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని ఇటీవల వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కొత్తగా ఏర్పాటయ్యే వాటితో కలిపి మొత్తం 27 మెడికల్‌ కాలేజీల్లో క్యాన్సర్‌ నివారణకు రెండు చొప్పున లైనాక్‌ మెషిన్లు ఉండేలా బ్లూ ప్రింట్‌ సిద్ధం చేయాలని ఆదేశించారు. విశాఖ, తిరుపతి, గుంటూరు కాలేజీల్లో క్యాన్సర్‌ నివారణకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటుకు పూర్తి స్థాయి ప్రతిపాదనలను రూపొందించాలని సూచించారు.


మూడో దశలో గుర్తిస్తే సంక్లిష్టం
క్యాన్సర్లలో 33.2 శాతం ముందుగానే గుర్తించి సరైన చికిత్స అందిస్తే నయం అవుతోంది. మహిళల్లో రొమ్ము, నోటి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లలో 49.2 శాతం ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే తక్కువ ధరతోనే నయం అవుతున్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే రూ.71 వేల లోపే వ్యయంతో 99 శాతం నయం అవుతోంది. అదే మూడో దశలో గుర్తించి రూ.1.76 లక్షలు వ్యయం చేసినా 29 శాతమే నయంఅవుతోంది. 

లక్షల్లో మరణాలు..
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌ కేసులు ఏటా పెరిగిపోతున్నాయి. మన దేశంలో 2020లో కొత్తగా 13.24 లక్షలకుపైగా క్యాన్సర్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో దాదాపు 6.8 లక్షలు మహిళల్లో క్యాన్సర్‌ కేసులు కాగా 6.5 లక్షలు పురుషుల్లో క్యాన్సర్‌ కేసులున్నాయి. 2020లో క్యాన్సర్‌తో 8.5 లక్షల మంది మృతి చెందగా రాష్ట్రంలో 34 వేల మంది మృత్యువాత పడినట్లు అంచనా. 2030 నాటికి దేశంలో క్యాన్సర్‌ కేసులు 28 శాతం మేర పెరగవచ్చని అంచనాలు పేర్కొంటున్నాయి. 

ఆరోగ్యశ్రీలో పెరిగిన చికిత్స వ్యయం
రాష్ట్రంలో కొత్త క్యాన్సర్‌ కేసులు 70 వేల వరకు ఉండవచ్చని అంచనా. పురుషుల్లో అత్యధికంగా నోటి క్యాన్సర్, మహిళల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్లు ఎక్కువగా నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం 39,768 క్యాన్సర్‌ కేసులుండగా అత్యధికంగా ఉమ్మడి తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో 13 శాతం చొప్పున నమోదయ్యాయి. 16 శాతం బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కేసులున్నాయి.

2030 నాటికి రాష్ట్రంలో క్యాన్సర్‌ కేసులు 70 వేల వరకు పెరగవచ్చని అంచనా. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా 2019 నుంచి 2021 వరకు క్యాన్సర్‌ చికిత్స వ్యయం 37.3 శాతం మేర పెరిగింది. 2021–22లో ఆరోగ్యశ్రీలో 1,18,957 క్యాన్సర్‌ కేసులకు చికిత్స అందించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్‌ చికిత్సలు 24 శాతం పెరిగాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement