
క్రోసూరు: క్యాన్సర్ బారిన పడిన వలంటీర్‌కు ప్రభుత్వం సాయం చేయడంతో అతడు పూర్తిగా కోలుకుని తిరిగి విధుల్లో చేరాడు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం నాగవరం గ్రామానికి చెందిన షేక్ ఉమ్మర్ ఖయ్యుం ఆటో నడుపుతుంటాడు. వారి పెద్ద కుమారుడు షేక్ మహమ్మద్ డిగ్రీ పూర్తి చేసి వలంటీర్‌గా పనిచేస్తున్నాడు. మహమ్మద్ 2021లో బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డాడు. ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదు.
సమాచారం తెలుసుకున్న పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అతని ఇంటికి వెళ్లి పరామర్శించి వెంటనే ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పించారు. సీఎం వైఎస్ జగన్‌కి వినతి పెట్టారు. వెంటనే స్పందించిన సీఎం జగన్..మహమ్మద్‌కు ఎంత ఖర్చు అవుతుందో అంతా ప్రభుత్వమే భరాయించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహమ్మద్‌కు ప్రభుత్వం రూ.78 లక్షలు మంజూరు చేసింది. పూర్తిస్థాయిలో చికిత్స పొంది మహమ్మద్ ఇంటికి చేరుకున్నాడు. వైఎస్సార్ ఆసరా ద్వారా నెలకు రూ.5,000 చొప్పున 6 నెలల పాటు అందించి మందులను కూడా ఉచితంగా అందజేసింది.
సీఎం జగన్ లాంటి నేత ఉండటంతోనే తాము ఈ సమస్య నుంచి బయటపడ్డామని, ఆయనకు తాము ఎంతగానో రుణపడి ఉన్నామని ఖయ్యుం కుటుంబసభ్యులు తెలిపారు. మహమ్మద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చొరవతో సీఎం జగన్ వెంటనే స్పందించి తనను ఆదుకున్నారని, జీవితంలో ఒక్కసారి సీఎం జగన్‌ని కలిసి కృతజ్ఞతలు తెలపాలని తన కోరిక అని చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment