భోగాపురం : ఎయిర్‌పోర్టుకి మా Cఇచ్చేదిలేదని ఆర్‌డీఓ వెంకటరావు ఎదుట రైతులు కరాఖండిగా చెప్పేశారు. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఆర్‌డీఓ వెంకటరావు స్థానిక నాయకులతో శనివారం సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం సుమారు 1.30 ప్రాంతంలో ఆయన భోగాపురం వచ్చారు. పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న వేదిక వద్ద కూర్చుని స్థానిక నాయకులకు కబురు పెట్టడంతో వారంతా కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఆయన ఎయిర్‌పోర్టు విషయం మాట్లాడకుండా చాకచక్యంగా ఉపాధి పనుల గురించి, పంచాయతీలో సమస్యల గుర్తించి ప్రస్తావించారు.
వేదిక వద్దకు చేరుకున్న గ్రామస్తులు ఇదంతా ఎందుకు మీరు దేని గురించి వచ్చారో మాకు తెలుసు మేం ఎయిర్‌పోర్టుకి భూములిచ్చేది లేదని చెప్పారు. అయితే ఎయిర్‌పోర్టు గురించి తొందరపడనవసరంలేదు, ఇంకా జీఓ రాలేదు అని ఆర్‌డీఓ సమాధానం చెప్పారుు. జీఓ రాకుండా ఎందుకు గ్రామాల్లో వాల్ పోస్టర్లను అతికించేందుకు వీఆర్‌ఓలను పంపించారని నిలదీశారు. దీనికి ఆయన ఏ సమాధానం చెప్పలేదు. కొయ్యపేటకు చెందిన రైతు కొయ్య బంగార్రాజు మాట్లాడుతూ... నా కున్న భూమిని అమ్ముకుంటే ప్రభుత్వం ఇచ్చే ధరకంటే నాలుగురెట్లు ఇప్పుడే వస్తుంది, అయితే వ్యవసాయం చేసుకుని బతికేవాళ్ళం మా భూములను వదులుకోలేక అమ్మలేదు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటామంటే ఊరుకునేదిలేదని చెప్పాడు.
అలాగే భోగాపురం ఈస్ట్‌లో 700 ఎకరాలు పోయే అవకాశం ఉందని, దీనిని మేం ఒప్పుకునేది లేదని స్థానిక నాయకులు స్పష్టం చేశారు. మీరు రమ్మంటే గౌరవంగా వచ్చామని, మీతో మాట్లాడినట్లు తెలిస్తే మా ప్రజలు ఊరుకోరని స్థానిక నాయకులు తెలిపారు. దీంతో ఆర్‌డీఓ అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పీటీసీ సభ్యుడు పడాల శ్రీనువాసరావు, ఉపసర్పంచ్ గుండాల మన్మధరావు, మాజీ ఉసర్పంచ్ కొమ్మూరు సుభూషణరావు, ఉదయబాబు, విశ్వేశ్వరరావు, రౌతు వాసు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మా భూములు ఇచ్చేది లేదు
Published Sun, Apr 19 2015 4:27 AM | Last Updated on Sat, Aug 18 2018 6:29 PM
Advertisement
Advertisement