ఒక్క రోజులో వెంకన్న దర్శనం
తిరుపతికి ప్రత్యేక గగనతల పర్యాటక ప్యాకేజీ
- ఒక్కరోజు ప్యాకేజీ ధర రూ.10 వేలు, రెండు రోజులకు రూ.13 వేలు
- విమాన టికెట్, దైవదర్శనం, రవాణా, భోజనం, వసతి అన్నీ కలిపే ధర
- కాణిపాకం, తిరుచానూరు, శ్రీకాళహస్తిని కలుపుతూ యాత్ర
- అందుబాటులోకి తీసుకొచ్చిన పర్యాటక శాఖ, టీఎస్‌టీడీసీ
- మే రెండో వారంలో ప్రారంభించనున్న మంత్రి చందూలాల్
సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవులు వచ్చేశాయ్.. ఆధ్యాత్మికం.. వినోదాన్ని కలగలుపుతూ.. విహార యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా..? మీలాంటి వారి కోసమే సరికొత్త ప్యాకేజీలను తెలంగాణ పర్యాటక శాఖ, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ తీసుకొస్తున్నాయి. ఒక్కరోజులోనే తిరుపతి వెంకన్న దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి చేరుకునేలా ప్రత్యేక గగనతల ప్రయాణ ప్యాకేజీలను తెలంగాణ ప్రజల ముంగిటకు తెచ్చాయి. దైవదర్శనంతో పాటు భోజనం, వసతి, రవాణా సదుపాయాలను కూడా కల్పిస్తాయి.
తిరుపతితో పాటు కాణిపాకం, శ్రీనివాస మంగాపురం(తిరుచానూరు), శ్రీకాళహస్తి వంటి పర్యాటక ప్రాంతాలను కలుపుతూ యాత్రకు శ్రీకారం చుట్టాయి. ఇలాంటి యాత్రనే 2009–10లో ప్రారం భించినా.. ఆ తర్వాత వదిలేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పుడు ఈ స్పెషల్ ప్యాకేజీలను తిరిగి ప్రారంభిస్తున్నారు. దీనికోసం విమానయాన సంస్థ ‘స్పైస్ జెట్’తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ యాత్రను మే రెండో వారంలో రాష్ట్ర పర్యాటక మంత్రి అజ్మీరా చందూలాల్, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రారంభించనున్నారు.
‘ఒక్కరోజు’ ప్యాకేజీ ఇలా..
హైదరాబాద్‌లో ఉదయం 6.55 గంటలకి యాత్ర మొదలవుతుంది. ఉదయం 8.10కి తిరుపతికి.. అక్కడి నుంచి 9.30కి తిరుమల చేరుకుంటారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 మధ్య వేంకటేశ్వ రుని శీఘ్రదర్శనం పూర్తవుతుంది. మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల మధ్య భోజనం, విశ్రాంతి కల్పిస్తారు. అటు తర్వాత తిరుచానూరు తీసుకెళ్లి పద్మావతీ అమ్మవారి దర్శనాన్ని 3.30 నుంచి 4 గంటల మధ్య కల్పిస్తారు. సాయంత్రం 5.35 గంట లకు తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 7.45 గంటలకు తిరిగి నగరానికి చేరుకుంటారు. శనివారం మాత్రం తిరుపతి ఎయిర్‌పోర్టుకు రాత్రి 8.25కి చేరుకుంటారు. రాత్రి 9.40కి హైదరాబాద్ వస్తారు. ఒక్కొక్కరికీ రూ.10 వేలు దాకా ధర నిర్ణయించారు.
‘రెండు రోజుల’ ప్యాకేజీ ఇదీ..
హైదరాబాద్‌లో ఉదయం 9.25కి బయలుదేరి.. 10.45కి తిరుపతి చేరుకుంటారు. ఉదయం 11.30 నుంచి 12.30 గంటల మధ్య శ్రీకాళహస్తి ఆలయానికి తీసుకెళ్తారు. అక్కడ శివుని దర్శనం పూర్తి కాగానే.. మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల మధ్య భోజనం, విశ్రాంతి కల్పిస్తారు. సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల మధ్య కాణిపాకం లేదా తిరుచానూరు తీసుకెళ్తారు. అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు తిరుపతి ఫార్చ్యూన్ కేన్సస్ హోటల్లో రాత్రి బస కల్పిస్తారు.
మరుసటి రోజు ఉదయం 9.30కి తిరుమల చేరుకుంటారు. 10 గంటల నుంచి 12.30 మధ్య శీఘ్రదర్శనం కల్పిస్తారు. 1.30 నుంచి 3 గంటల మధ్య భోజనం, విశ్రాంతి కల్పించి, 3.30 నుంచి 4 గంటల మధ్య కాణిపాకం లేదా తిరుచానూరు పద్మావతీ అమ్మవారి దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6.35కి తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 7.45కి హైదరాబాద్ చేరుకుంటారు. శనివారం మాత్రం రాత్రి 8.25కు తిరుపతి ఎయిర్‌పోర్టుకు.. రాత్రి 9.40కి హైదరాబాద్‌కు చేరుకుంటారు. విమాన చార్జీలు, ఏసీ అకామిడేషన్, ట్రాన్స్‌పోర్టేషన్, భోజనం, దైవదర్శనం అన్నీ కలుపుకుని టికెట్ ధరను రూ.13 వేలుగా నిర్ణయించినట్లు తెలిసింది.
బుకింగ్ కోసం..
విమానంలో తిరుపతి వెళ్లాలనుకునే వారు టీఎస్‌టీడీసీ సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయాల్లో సంప్రదించవచ్చు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్–9848540371, ట్యాంక్‌బండ్ రోడ్డు–9848125720, పర్యాటక భవన్– 9848306435, శిల్పారామం 040–23119557, కూకట్పల్లి 040–23052028, సికింద్రాబాద్ యాత్రీ నివాస్–9848126947, వరంగల్ 0870– 2562236, నిజామాబాద్ 08462–224403, మార్కెటింగ్ డివిజన్ 040–23412129, 8096947700ల్లో సంప్రదించవచ్చు.