శ్రీవారి ఆలయంలో శాస్రోక్తంగా తిరుమంజనం
► సుగంధ పరిమళంతో వైదికంగా శుద్ధి
► గుబాళిస్తున్న శ్రీవారి ఆలయం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్రోక్తంగా నిర్వహించారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. రేపటి బుధవారం ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఈ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు భక్తులకు స్వామివారి దర్శనం నిలిపివేశారు. ఆ తర్వాత ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని వైదికంగా ప్రారంభించారు.
మహద్వారం మొదలు, ప్రాకారాలు, గోడలు, పైకప్పు, పూజలకు వాడే రాగి, వెండి, బంగారం, ఉత్సవాలకు వాడే వాహనాలు, ఇతర వైదికపరమైన అన్ని వస్తువులు శుద్ధి చేశారు. గర్భాలయంలోని మూలమూర్తి (మూలవిరాట్టు)పై దుమ్ము, దూళి పడకుండా మలైగుడారం ( ప్రత్యేక శ్వేత పట్టు వస్త్రం) కప్పారు. శుద్ధి పూరైన తర్వాత నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంథం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలతో కలిపిన పవిత్ర మిశ్రమ తిరుమంజనాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.
టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు శ్రీవారికి కొత్త పరదాలు సమర్పించారు. చివరగా అర్చకులు గర్భాలయ మూలమూర్తిపై కప్పిన వస్త్రాన్ని తొలగించి ఆగమోక్తంగా పూజలు, నైవేద్య కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత ఉదయం 11 గంటల నుంచి భక్తులను శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఉదయం నిర్వహించాల్సిన అష్టదళ పాద పద్మారాధన ప్రత్యేక వారపు సేవను రద్దు చేశారు.