టమాటో + పొటాటో = టామ్‌టాటో..
టమాటో+పొటాటో = టామ్‌టాటో.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు టైపులో ఒకే మొక్కకు అటు టమాటో.. ఇటు బంగాళదుంపలు అన్నమాట. బ్రిటన్‌కు చెందిన థాంప్సన్ అండ్ మోర్గాన్ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. అదీ మన ఇంట్లో పెంచుకునే టైపులో.. అలాగనీ ఇది జన్యుమార్పిడి మొక్క కానేకాదు.. ఎప్పట్నుంచో అనుసరిస్తున్న మొక్కలు అంటు కట్టే విధానంలోనే ఆధునిక పద్ధతులను వీరు అవలంభించారట. గతంలో బ్రిటన్‌లోనూ టమాటో, పొటాటోను అంటు కట్టినా.. రుచి వంటి వాటి విషయాల్లో వాటిల్లో లోటుపాట్లు ఉన్నాయట.
టామ్‌టాటో విషయంలో ఆ సమస్యలేమీ లేవట. అంతేకాదు.. తొలిసారిగా వాణిజ్యపరంగా విజయవంతమయ్యేలా టామ్టాటోను తీర్చిదిద్దారు. అంటే.. త్వరలో దీన్ని మార్కెట్లోకి విక్రయిం చేందుకు తేనున్నారన్నమాట. ఇది 10 ఏళ్ల కృషి ఫలితమని ఈ సంస్థ డెరైక్టర్ పాల్ చెప్పారు. ‘ప్రతి టామ్‌టాటో మొక్క అంటు కట్టే ప్రక్రియను హాలండ్‌లోని ఓ ప్రయోగశాలలో పూర్తి చేస్తాం. తర్వాత అది బ్రిటన్‌కు వస్తుంది. ఇక్కడ మేం దాన్ని గ్రీన్‌హౌజ్‌లో పెంచుతాం. బాగా పెరిగిన తర్వాత విక్రయిస్తాం’ అని తెలిపారు.