రాజీవ్ రహదారి దిగ్బంధం
కరీంనగర్: తోటపల్లి రిజర్వాయర్‌ను ప్రతిపాదిత ప్రాంతంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ బుధవారం రాజీవ్ రహదారిని దిగ్బంధించింది. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ స్టేజీ వద్ద కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, ఆరేపల్లి మోహన్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తదితరులు జాతీయ రహదారిపై బైఠాయించారు. మహిళలు వంటావార్పు నిర్వహిస్తుండగా, నాయకులు కబడ్డీ ఆడుతూ నిరసన తెలిపారు.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నేతలు తమ ఆందోళనను కొనసాగించారు. ఓబుల్లాపూర్, టోటపల్లిలోనే రిజర్వాయర్‌ను యథావిధిగా కొనసాగించాలని, రద్దు చేసే ఆలోచనను విరమించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. కాగా, జాతీయ రహదారిపై ధర్నాతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు వాహనాలను మళ్లించి రాకపోకలకు అవాంతరం కలగకుండా చర్యలు తీసుకున్నారు.