నాలుగేళ్లయినా..నత్తనడకే!
‘తోటపల్లికి నేనే శంకుస్థాపన చేశాను. నేనే పూర్తిచేసి నీరిచ్చాను. అవునా కాదా.. తమ్ముళ్లూ...’ విజయనగరంలో మంగళవారం నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న మాటలివి. ఆయన వందిమాగధులు వాటికి వంతపాడినా.. వాస్తవమేమిటో ఆ ప్రాంత రైతులకు తెలుసు. ఎవరో పూర్తిచేసినదాన్ని ఆయన ప్రారంభించేసి అదేదో తన ఘనతలా చెప్పుకున్నా... ఆ తరువాత చేయాల్సిన పదిశాతం పనులు చేయడంలో ఇప్పుడు పిల్లిమొగ్గలు వేస్తున్నారు. దీనివల్ల వేలాది ఎకరాలకు సాగునీరందక... దీనిపైనే ఆశలు పెట్టుకున్న రైతాంగం ఎప్పుడు పూర్తవుతుందా... అని ఎదురు తెన్నులు చూస్తోంది. కానీ నాలుగేళ్లు కావస్తున్నా... ఇంకా అసంపూర్తిగా ఉండిపోవడమే విచారకరం.
విజయనగరం గంటస్తంభం: తోటపల్లి ప్రాజెక్టు ఎన్నోఏళ్లనాటి కల. రైతుల డిమాండ్‌ను తాను ఆధికారంలో ఉన్న తొమ్మిదేళ్లు పట్టించుకోని చంద్రబాబునాయుడు 2004 ఎన్నికలకు ముందు ఓట్లు దండుకునే క్రమంలో ఆదరాబాదరాగా శంకుస్థాపన చేసి వదిలేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నిధులు విరివిగా కేటాయించి పనులు దాదాపుగా పూర్తికానిచ్చారు. 2008లో 450.24కోట్లు అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులు ఇవ్వగా పనులు ప్రారంభమయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పాతఆయకట్టు 64వేల ఎకరాలతోపాటు కొత్తగా 1.20లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. గజపతినగరం బ్రాంచి కాలువ ద్వారా మరో 15వేల ఎకరాలకు నీరందించేందుకు కూడా ఆయన అనుమతులు మంజూరు చేశారు. ఆయన హాయాంలో రూ.400కోట్లు ఖర్చు చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం అంచనాలు రూ.750కోట్లకు పెంచింది. ఎట్టకేలకు నిధులు విడుదల కావడంతో 2014 నాటికి దాదాపుగా 90శాతం పనులు పూర్తయ్యాయి.
అడ్డు తాత్కాలికంగా తొలగించి నీరు విడుదల
10శాతం పనులు మిగిలి ఉండడంతో వాటిని పూర్తి చేసి మొత్తం ఆయకట్టుకు నీరివ్వాల్సిన బాధ్యత ప్రస్తుత తెలు గుదేశం ప్రభుత్వంపై పడింది. కానీ ప్రభుత్వం మొత్తం
పనులపై పూర్తిస్థాయిలో దృష్టిసారించలేదు. అప్పటికే మెయిన్ కెనాల్ పనులతోపాటు బ్రాంచి కెనాల్స్ పనులు పూర్తయి ఉండగా వాటిపై రైతులు పొలాలకు వెళ్లేందుకు ఉన్న అడ్డు తొలగించి కాలినడక వంతెనలు నిర్మించి నీటిని విడుదల చేశారు. ఇది జరిగి నాలుగేళ్లు గడిచినా ఇంతవరకు మిగతా పనులు పూర్తి చేయకపోవడం విశేషం. కాలువల లైనింగు పనులు, డైవర్షన్ కెనాల్, పొలాలకు నీటి సరఫరాకు పిల్ల కాలువ పనులు పెండింగ్‌లో ఉన్నా యి. నీరు విడుదల చేసే నాటికి ఈ పనులు పెండింగ్‌లో ఉండగా ఇప్పటికీ పూర్తి చేయకపోవడం విశేషం. వాస్తవానికి పనులు చేసేందుకు ఈ ప్రభుత్వం అంచనాలను రూ.1015కోట్లకు పెంచినా పనులు మాత్రం పూర్తి చేయలేకపోయింది. పనిచేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు సిద్ధంగా ఉన్నా భూసేకరణ, నిధుల కొరత వంటి సమస్యలు వేధిస్తున్నాయి. ప్రాజెక్టు పరిధిలో ఇంకా 376 ఎకరాలు భూసేకరణ జరగాల్సి ఉంది. పనులు చేసేందుకు అవసరమైన నిధులు కాంట్రాక్టర్‌కు అందాల్సి ఉంది. ఈ ఏడాది బడ్జెట్లో రూ.152కోట్లు నిధులు కేటాయించినా బిల్లులు మాత్రం సకాలంలో జరగకపోవడంతో కాంట్రాక్టరు నాన్చుతున్నారు.
పూర్తి ఆయకట్టుకు అందని నీరు
డైవర్షన్ కెనాల్స్, పిల్ల కాలువ పనులు చేయకపోవడంతో పంట పొలాలకు నీరందే అవకాశం లేదు. నీరు విడుదల చేసిన తర్వాత నాలుగేళ్లకు వచ్చిన ఖరీఫ్ సీజన్లో కూడా రెండు జిల్లాల్లో పూర్తి విస్తీర్ణానికి నీరు విడుదల చేయలేకపోయారు. 1.20లక్షల ఎకరాల్లో ఈ ఏడాది 70వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీరిచ్చామని అధికారులు చెబుతుండడం ఇందుకు నిదర్శనం. జిల్లాలో కొన్ని మండలాల్లో ఒక ప్రాంతానికి నీరందకపోగా మరికొన్ని మండలాల్లో పూర్తిగా అందలేదు. తెర్లాం మండలంలో 10వేల ఎకరాలకు తోటపల్లి నీరు రావాల్సి ఉండగా ఈ ఏడాది 4900 ఎకరాలకు మాత్రమే విడుదల చేశారు. టైలెండ్లో ఉన్న చీపురుపల్లి, గరివిడి, గుర్ల మండలాలకు అసలు నీరు విడుదల కానేలేదు. అక్కడి రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరవు కాలంలో నీరివ్వనపుడు ప్రాజెక్టు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌కైనా నీరొస్తుందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
భూసేకరణ జరగాల్సి ఉంది
ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తి కాలేదు. డైవర్షన్ కెనాల్స్, పిల్ల కాలువల కోసం భూమి అవసరం ఉంది. రెవెన్యూ అధికారులను సేకరించి ఇవ్వాలని కోరాం. ఇచ్చిన వెంటనే పూర్తి చేస్తాం. ఈ ఏడాది 70వేల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చాం. చెరువుల ద్వారా ఇతర భూములకు 40వేల వరకు ఇచ్చాం. వచ్చే జూన్ నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– పోలేశ్వరరావు, ఎస్ఈ, టీటీపీఆర్ సర్కిల్