Thottathil B Radhakrishnan
-
జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ కన్నుమూత
తిరువనంతపురం: న్యాయ కోవిదుడు జస్టిస్ తొట్టాటిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్(63) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కొచ్చిలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కన్నుమూశారు. సొంత రాష్ట్రం కేరళ హైకోర్టు జడ్జిగా, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించిన రాధాకృష్ణన్.. అటుపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు(హైదరాబాద్ హైకోర్టు), ఆపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారాయన. అంతకు ముందు సుదీర్ఘకాలంగా కేరళ హైకోర్టు జడ్జిగా(2004-17) బాధ్యతలు నిర్వహించి.. శాశ్వత న్యాయమూర్తి హోదా దక్కించుకున్నారు. ఆ సమయంలోనే రెండుసార్లు తాత్కాలిక సీజేగానూ కేరళ హైకోర్టులో బాధ్యతలు నిర్వహించారు. ఆపై 2017 మార్చిలో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టారు. అటుపై బదిలీ మీద హైదరాబాద్ హైకోర్టు(తెలుగు రాష్ట్రాల ఉమ్మడి)కు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చారు. 2019 జనవరి 1వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి పూర్తిస్థాయి సీజేగా ఆయన ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. ఆపై నాలుగు నెలలకే కోల్‌కతా హైకోర్టుకు బదిలీ మీద వెళ్లారు. అడ్వొకేట్ దంపతులు భాస్కరన్ నాయర్, పారుకుట్టి అమ్మ దంపతులకు కొల్లాంలో జన్మించారు రాధాకృష్ణన్. కోలార్ కేజీఎఫ్ లా కాలేజీ నుంచి లా డిగ్రీ అందుకుని.. 1983 నుంచి తిరువనంతపురం కోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టారాయన. ఆపై హైకోర్టుకు వెళ్లారు. కేరళ లీగల్ సర్వీసెస్ అథారిలీ చైర్మన్‌గానూ ఆయన పని చేశారు. కేరళలోని మానసిక చికిత్సాలయాల పనితీరులో జోక్యం ద్వారా ఈయన పేరు అప్పట్లో ప్రముఖంగా వినిపించింది. రాధాకృష్ణన్‌కు భార్య మీర్యాసేన్తో పాటు పార్వతీ నాయర్, కేశవరాజ్ నాయర్ పిల్లలు ఉన్నారు. జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం చెబుతున్నారు. -
ఏ రాష్ట్ర కేసులు ఆ రాష్ట్ర హైకోర్టుకే బదిలీ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు ఏర్పడే నాటికి దాఖలైన అప్పీళ్లు, కోర్టు ధిక్కార పిటిషన్లు, పునః సమీక్షా పిటిషన్లపై విచార ణ జరిపే పరిధి ఉమ్మడి హైకోర్టుకు ఉందం టూ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 40(3) చెబుతున్న నేపథ్యంలో, ఇలాంటి వ్యాజ్యాలపై ఏ రాష్ట్ర హైకోర్టు విచారించాలన్న అం శంపై తెలంగాణ హైకోర్టు ఫుల్ బెంచ్ మం గళవారం స్పష్టతనిచ్చింది. ఉమ్మడి హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్లు, రిట్ అప్పీళ్లు, కోర్టు ధిక్కార వ్యాజ్యాలు, పునః సమీక్షా పిటిషన్లను రాష్ట్రానికి చెందిన వాటిని ఆ రాష్ట్రానికి బదలాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అయితే ఇరు రాష్ట్రాలతో ముడిపడి ఉన్న వ్యాజ్యాల విషయం లో మాత్రం, ఆ వ్యాజ్యాల్లోని ప్రధాన అంశం ఏ రాష్ట్ర పరిధిలోకి వస్తుందో నిర్ణయించి, దాన్ని ఆ రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేసే విషయంలో సీజే పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఒక్కో కేసు ఆధారంగా సీజే జారీ చేసే పాలనాపరమైన ఉత్తర్వుల ఆధారంగా ఆ కేసుల బదలాయింపు జరపాల్సి ఉంటుందని పేర్కొంది. సర్వీసు వివాదాల విషయంలోనూ దీన్నే అనుసరించాల్సి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఫుల్‌బెంచ్ తీర్పు వెలువరించింది. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 40(3) వల్ల ఏపీ హైకోర్టు న్యాయవాదులు ఇబ్బందులు ఎదుర్కొంటారని, కాబట్టి ఈ వ్యవహారంపై తగిన ఆదేశాలు జారీ చేయాలని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం తెలంగాణ హైకోర్టు సీజేకి లేఖ రాసింది. ఈ లేఖను పరిశీలించిన సీజే దాన్ని పిల్ పరిగణించారు. ఈ వ్యాజ్యంలో కీలక అంశాలు ముడిపడి ఉన్నందున దీనిపై ఫుల్‌బెంచ్‌ను ఏర్పాటు చేయడమే మేలని నిర్ణయించి ఆ మేర ఫుల్ బెంచ్‌ను ఏర్పాటు చేశారు. -
తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా రాధాకృష్ణన్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్ కొనసాగనున్నారు. జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్ కూడా తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తులుగా కొనసాగుతారని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించింది. ఈ నియామకాలు జనవరి 1, 2019 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. (ఇక ఎవరి హైకోర్టు వారిదే) కేరళలోని కొల్లాంలో 1959, ఏప్రిల్ 29న రాధాకృష్ణన్ జన్మించారు. అక్కడే పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. కర్ణాటకలోని కొలార్ గోల్డ్ ఫీల్డ్ లా కాలేజీ నుంచి లాయర్ పట్టా సాధించారు. తిరువనంతపురంలో 1983లో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. సివిల్ లాయర్‌గా పేరుగాంచిన రాధాకృష్ణన్ రెండుసార్లు కేరళ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. గతేడాది మార్చి 18న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది జూలైలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో హైదరాబాద్‌లోని హైకోర్టు తెలంగాణ హైకోర్టుగా కొనసాగనుంది. దీనికి చీఫ్ జస్టిస్‌గా రాధాకృష్ణన్‌ను కొనసాగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు.