జస్టిస్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్ కొనసాగనున్నారు. జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్ కూడా తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తులుగా కొనసాగుతారని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించింది. ఈ నియామకాలు జనవరి 1, 2019 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. (ఇక ఎవరి హైకోర్టు వారిదే)
కేరళలోని కొల్లాంలో 1959, ఏప్రిల్ 29న రాధాకృష్ణన్ జన్మించారు. అక్కడే పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. కర్ణాటకలోని కొలార్ గోల్డ్ ఫీల్డ్ లా కాలేజీ నుంచి లాయర్ పట్టా సాధించారు. తిరువనంతపురంలో 1983లో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. సివిల్ లాయర్‌గా పేరుగాంచిన రాధాకృష్ణన్ రెండుసార్లు కేరళ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. గతేడాది మార్చి 18న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది జూలైలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో హైదరాబాద్‌లోని హైకోర్టు తెలంగాణ హైకోర్టుగా కొనసాగనుంది. దీనికి చీఫ్ జస్టిస్‌గా రాధాకృష్ణన్‌ను కొనసాగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment