మోడీ సభకు మూడు వేల మందితో బందోబస్తు
= మోడీ సభకు మూడు వేల మందితో బందోబస్తు
= రంగంలో గుజరాత్ పోలీసులు
= ‘పాట్నా’ సంఘటన దృష్ట్యా భద్రత పెంపు
= పలు చోట్ల సీసీ కెమెరాల ఏర్పాటు
= సభా స్థలి పరిసరాల్లో రేపు మద్యం దుకాణాల మూసివేత
= నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బీహార్లో ఎదురైన సంఘటన దృష్ట్యా ఇక్కడి ప్యాలెస్ మైదానంలో ఆదివారం జరిగే బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ తెలిపారు. శుక్రవారం ఆయన సభా స్థలిని సందర్శించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పది మంది డీసీపీలు, 25 మంది ఏసీపీలు, వంద మంది ఇన్స్పెక్టర్లు, 300 మంది ఏఎస్ఐలు, మూడు వేల మంది పోలీసులు, 800 మంది హోమ్ గార్డులు, ఐదు వందల మంది పౌర రక్షణ సిబ్బందిని బహిరంగ సభ వద్ద మోహరించనున్నట్లు వివరించారు. బహిరంగ సభకు ముందు మోడీ రెండు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. హెలికాప్టర్లోనే అన్ని కార్యక్రమాలకు హాజరవుతారని చెప్పారు.
బీహార్ సంఘటన దృష్ట్యా ప్రత్యేక భద్రతను కల్పించాలన్న కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా తాము వ్యవహరిస్తున్నామని వెల్లడించారు. ఆయన వచ్చి, తిరిగి వెళ్లేంత వరకు నగర వ్యాప్తంగా పటిష్టమైన బందోబస్తు ఉంటుందని తెలిపారు. బస్సు స్టేషన్లు, విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, మాల్స్ వద్ద సిబ్బందిని మోహరించనున్నట్లు చెప్పారు. గుజరాత్ పోలీసులు కూడా వస్తున్నారని, తమ సిబ్బంది వారితో ఉంటుందని తెలిపారు.
వీరికి తోడు 1,400 మంది బీజేపీ స్వయం సేవకుల సహకారాన్ని కూడా తీసుకోదలచామని చెప్పారు. బహిరంగ సభకు హాజరయ్యే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతిస్తామని తెలిపారు. పదకొండు గంటలకు ప్రారంభయ్యే సభకు తొమ్మిది గంటల నుంచే ప్రవేశానికి అవకాశం కల్పిస్తామన్నారు. మొబైల్ ఫోన్లను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. జేసీ నగర, యశవంతపుర పోలీసుల స్టేషన్ల పరిధిలో ఆదివారం మద్యం విక్రయాలను నిషేధించనున్నట్లు ఆయన వెల్లడించారు.