thrashed by teacher
-
విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు
జమ్మూ కశ్మీర్ : ట్యూషన్‌కి ఆలస్యంగా వచ్చారని ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులను చితకబాదాడు. ఈ ఘటన జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లా గుజ్జర్ బకర్వాల్ బాయ్స్ హస్టల్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..యాసిన్ అనే ఉపాధ్యాయుడు హాస్టల్ నుంచి ట్యూషన్‌కు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులపై ఇష్టానుసారంగా దాడి చేశాడు. గంటపాటు వారిని నిలబెట్టి కనికరం లేకుండా బెత్తంతో కొట్టాడు. దాదాపు 25 మందిని యాసిన్ చితకబాదినట్టు బాధిత విద్యార్థులు పేర్కొన్నారు. మాస్టర్ తమను ఇలా దండించడం తొలిసారి కాదని వారు తెలిపారు. విద్యార్థులపై తాను చెయ్యి చేసుకున్నది నిజమేనని అంగీకరించిన యాసిన్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతామని అధికారులు వెల్లడించారు. విద్యార్థులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డ ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. -
టీచర్లు కొట్టారని.. విద్యార్థి ఆత్మహత్య
అహ్మదాబాద్: మరో నెలరోజుల్లో పబ్లిక్ పరీక్షలు రాయాల్సిన పదోతరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం చదువు లేకో, చదువు రాకో కాదు. చిన్న కారణానికే టీచర్లు తనను తీవ్రంగా కొట్టినందుకు. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటనకు బాధ్యులైన నలుగురు ఉపాధ్యాయులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. 16 ఏళ్ల ప్రకాశ్ చౌహాన్ స్థానిక గాయత్రి విద్యాలయంలో పదోతరగతి చదువుతున్నాడు. పాఠశాలకు సంబంధించిన కెమెరాను పాడుచేశాడని ఆరోపిస్తూ నలుగురు ఉపాధ్యాయులు కలిసి విద్యార్థి ప్రకాశ్‌ను గదిలో బంధించి, విపరీతంగా కొట్టారు. గాయాలతో ఇంటికి వెళ్లిన ప్రకాశ్ జరిగిన విషయాన్ని తండ్రితో చెప్పి విపరీతంగా ఏడ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే సూసైడ్ నోట్ రాసి ఫ్యానుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు స్కూల్ పై దాడి చేశారు. ప్రకాశ్ తండ్రి ఫిర్యాదుమేరకు నలుగురు టీచర్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.