సీపీఎంకు ఎన్నికల సంఘం ఝలక్?
సీపీఎంకు జాతీయ పార్టీ హోదాను ఉంచాలా.. వద్దా అనే విషయాన్ని ఎన్నికల కమిషన్ సమీక్షించే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి మరీ దారుణంగా ఉండటంతో ఈ దిశగా యోచిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా ఐదేళ్లకోసారి ఎన్నికల్లో వివిధ పార్టీల పరిస్థితిని చూసి ఈ హోదాను నిర్ణయిస్తారు. అయితే ఇక మీదట ప్రతి రెండు ఎన్నికలకు ఒకసారి దీన్ని పరిశీలించాలని భావిస్తున్నారు. జాతీయ పార్టీ హోదా ఉంటే పలు రకాల ప్రయోజనాలు ఉంటాయి. జాతీయ మీడియాలో ప్రచారాలకు ఉచిత ఎయిర్టైమ్, 40 మంది వీవీఐపీ ప్రచారకర్తలకు ప్రయాణ ఖర్చులను అభ్యర్థి ఎన్నికల ఖర్చు నుంచి మినహాయించడం లాంటి సదుపాయాలు ఉంటాయి. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో సీపీఎం తరఫున లోక్సభకు కేవలం 9 మంది ఎంపీలే ఎన్నికయ్యారు.
హోదా వచ్చేదెలా?
కనీసం 11 మంది ఎంపీలు లోక్సభలో ఉండి, అది కూడా కనీసం 3 రాష్ట్రాల నుంచి ఉంటేనే పార్టీకి జాతీయ హోదా వస్తుంది. లేదా.. కనీసం నాలుగు రాష్ట్రాల్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలలో 6 శాతం ఓట్లు పొంది ఉండాలి, కనీసం 4 లోక్సభ స్థానాలు సాధించి ఉండాలి. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీ హోదా ఉన్నా కూడా జాతీయ హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తారు.
సీపీఎం పరిస్థితి ఏంటి
ప్రస్తుతం కేవలం పశ్చిమబెంగాల్, కేరళ, త్రిపుర.. ఈ మూడు రాష్ట్రాల్లోనే సీపీఎంకు రాష్ట్ర పార్టీ గుర్తింపు ఉంది. 9 లోక్సభ స్థానాలే ఉండటంతో పాటు కేవలం 3.25 శాతం ఓట్లు మాత్రమే కలిగి ఉంది. దీంతో ఆ పార్టీ జాతీయ హోదాకు గండి పడే ప్రమాదం కనిపిస్తోంది. దీంతోపాటు.. బీఎస్పీ, సీపీఐ, ఎన్సీపీల జాతీయ హోదాను కూడా పరిశీలించాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు సమాచారం. 2014 లోక్సభ ఎన్నికల్లోను, తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లోను ఈ పార్టీల ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అందుకే వాటి విషయంపై కూడా ఓ నిర్ణయం తీసుకునే యోచనలో ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది.