అదృశ్యమైన చిన్నారి హత్య
పక్కింటివారే చేసుంటారని తల్లిదండ్రుల అనుమానం
హైదరాబాద్: మూడు రోజుల కిందట ఇంటి నుంచి అదృశ్యమైన మూడున్నరేళ్ల చిన్నారి లాస్య(పండు) శుక్రవారం శవమై కనిపించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ గారాల పట్టి మృతదేహాన్ని చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని దీన్దయాల్నగర్కు చెందిన నవీన్, మయూరి దంపతుల కుమార్తె లాస్య బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటి బయట రోడ్డుపై కూర్చున్న తాత వద్దకు వెళ్లింది. కాసేపటికి తల్లి బయటకు వెళ్లగా లాస్య కనిపించలేదు. చుట్టు పక్కల ఎక్కడ వెతికినా పాప ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు గురువారం పోలీసులను ఆశ్రయించారు.
ఇదిలావుండగా.. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో పక్కింటి సజ్జ మీద నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చి అక్కడ వెతికారు. అక్కడున్న మూటలో తమ పాప మృతదేహం చూసి కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. పాప గొంతు కోసిన ఆనవాళ్లు ఉన్నాయి. పక్కింటి వారే తమ కుమార్తెను హత్య చేసి ఉంటారని లాస్య తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.