మూడు విభాగాలుగా కేజీ టు పీజీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం కేజీ టు పీజీని మూడు విభాగాలుగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏటా ఏడున్నర లక్షల మందికి ప్రయోజనం చేకూరే.. కేజీ టు పీజీ పథకం అమలుపై సచివాలయంలో శుక్రవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది (2016-17) కేజీ టు పీజీని ప్రారంభించాలని నిర్ణయించారు. మరోవైపు రాష్ట్రంలోని గురుకులాలన్నీ కేజీ టు పీజీలో భాగంగా చేసి, ఒకే డెరైక్టరేట్ నేతృత్వంలో వీటిని నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు.
అనంతరం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ ఆలస్యమైనా కేజీ టు పీజీని పకడ్బందీగా నిర్వహించే ఉద్దేశంతోనే నిఫుణుల సలహాల కోసం వేచి ఉన్నామన్నారు. ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. వాటిని కొనసాగిస్తూ గురుకుల విద్యాలయాల వ్యవస్థను కేజీ టు పీజీ పరిధిలోకి తేనున్నారు. నివాస వసతితో కూడిన విద్యా పథకంగా కేజీ టు పీజీని అమలు చేయనున్నారు.
ఇందులో కేజీ నుంచి 4వ తరగతి వరకు ఒక విభాగంగా చేస్తారు. ఇందులో వీలైతే అంగన్వాడీ కేంద్రాలను కూడా భాగం చేస్తారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇందులో మాతృ భాషలోనే బోధన విధానం ఉండే అవకాశం ఉంది. ఇక రెండో విభాగంలో 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు నివాస వసతితో కూడిన ఇంగ్లిషు మీడియం విద్యా బోధన ఉంటుంది. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కనీసంగా 10 గురుకులాలను ఏర్పాటు చేయనున్నారు. ఇలా మొత్తంగా 1,190 గురుకులాలను ఏర్పాటు చేస్తారు.
ప్రస్తుతం 668 ఉండగా, మిగతా 522 గురుకులాలను కొత్తగా ఏర్పాటు చేస్తారు. ఇంటర్మీడియట్ తరువాత విద్యను మూడో విభాగంలో భాగంగా పథకాన్ని అమలు చేస్తారు. ఇంటర్మీడియట్ తరువాత దీన్నెలా అమలు చేయాలన్న అంశంపై ఇంకా తుది నిర్ణయం జరగలేదు. అన్నింటిపై మరింత లోతైన అధ్యయనం చేసేందుకు సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సబ్ కమిటీలు విభాగాల వారీగా కాన్సెప్ట్ పేపర్‌ను రూపొందించనున్నాయి. ఆ తరువాత వాటిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.