అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవదహనం
ఘాజియాబాద్: అగ్నిప్రమాదంలో ముగ్గరు సజీవదహనమైన ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘాజియాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రగాయాలపాలైనట్టు తెలుస్తోంది. సియానీ గేట్ ఏరియా వద్ద టెంట్ హౌస్ లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రాత్రి 1.45 గంటల ప్రాంతంలో ఘటనా స్థలికి చేరుకున్నట్టు అగ్నిమాపక శాఖ అధికారి వికె. సింగ్ తెలిపారు. అప్పటికే అగ్నిజ్వాలలు ఎగసిపడుతుండటంతో నలుగురు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించినట్టు చెప్పారు. చివరికి గురువారం ఉదయానికి మంటలు అదుపులోకి తెచ్చినట్టు అగ్నిమాపక శాఖ వెల్లడించింది.
ఈ అగ్నిప్రమాదంలో సజీవ దహనమైన ముగ్గురు సంజీవ్, సునీల్, భవానీ అనే వ్యక్తులుగా గుర్తించామని చెప్పారు. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సింగ్ తెలిపారు. వీరంతా టెంట్ హూస్లో పనిచేస్తున్న సమయంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించినట్టు పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశించినట్టు వికె సింగ్ పేర్కొన్నారు.