కేసు పెట్టరా?
సాక్షి, చెన్నై: బహిరంగ ప్రదేశంలో విచక్షణా రహితంగా ఓ కుటుంబాన్ని చితకబాదిన ముగ్గురు పోలీసుల రాక్షసత్వంపై మద్రాసు హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పబ్లిక్‌లో ఇదేం తీరు, మానవ త్వం లేదా..? అని తీవ్ర ఆగ్రహాన్ని న్యాయమూర్తి వ్యక్తం చేశారు. ఆ ముగ్గురు పోలీసులపై కేసు ఎందుకు పెట్టలేదని, చర్యల్లో జాప్యం ఏలా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తిరువణ్ణామలై సమీపంలోని సెంగంలో నడి రోడ్డులో బహిరంగంగా ఓ దంపతులు , వారి కుమారుడిపై ముగ్గురు పోలీసులు ప్రదర్శించిన రాక్షసత్వం గురించి తెలిసిందే. తేకవాడియ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ రాజా, భార్య ఉష, కుమారుడు సూర్యలను కాళ్లతో తన్నుతూ, లాఠీలతో బాదుతూ చితక్కొట్టమే కాదు, ప్రశ్నించిన స్థానిక ప్రజల మీద రౌడీల వలే తమ వీరంగాన్ని సెంగం పోలీసులు నమ్ ఆళ్వార్, మురుగన్, విజయకుమార్ ప్రదర్శించారు.
బాధితుల్ని కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లకుండా, పోలీసు స్టేషన్‌కు బలవంతంగా లాక్కెళ్లారు. ఈ రాక్షసత్వ దాడి దృశ్యాలు కెమెరాలకు చిక్కడంతో వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరింది. బాధితుడు రాజ తరఫున గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు కావడం, దీనిని న్యాయమూర్తి ప్రకాష్ విచారణకు స్వీకరించడంతో ఆ కర్కశ ఖాకీల్లో గుబులు పట్టుకుంది.
కేసు పెట్టరా:
బహిరంగ ప్రదేశంలో పోలీసు రాక్షసత్వంపై దాఖలైన పిటిషన్ విచారణ సమయంలో న్యాయమూర్తి ప్రకాష్ తీవ్రంగా స్పందించారు. బహిరంగ ప్రదేశంలో ఇదేం తీరు అని అసహనం వ్యక్తం చేస్తూ, ఎందుకు ఇంత వరకు ఆ ముగ్గురు పోలీసులపై కేసులు పెట్ట లేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం తరపు న్యాయవాది షణ్ముగ వేలాయుధం జోక్యం చేసుకుని ఆర్డీవో విచారణ జరుగుతున్నదని, తదుపరి చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు.
అదే సమయంలో లాఠీ, పవర్ చేతిలో ఉన్నది కదా అని విచక్షణా రాహిత్యంగా కొట్టేస్తారా..?, ప్రశ్నించే వాళ్ల మీద కూడా తిరగబడతారా? అని ఆగ్రహాన్ని న్యాయమూర్తి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారిని కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లనట్టుందని స్పందించగా, వేలాయుధం జోక్యం చేసుకుని, ప్రస్తుతం వారికి తిరువణ్ణామలై ఆసుపత్రిలో చికిత్స అందించామని, భద్రత కూడా కల్పించామని కోర్టు దృష్టికి తెచ్చారు.
ప్రభుత్వ వాదనతో ఏకీభవించని న్యాయమూర్తి గాయపడ్డ ఆ ముగ్గుర్ని చెన్నై రాజీవ్‌గాంధీ ఆసుపత్రి లేదా, ఓమందూరు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాలని ఆదేశించారు. వారికి తగిన భద్రత కల్పించాలని, ఆర్టీవో విచారణ నివేదికను కోర్టు ముందు ఉంచాలని, ఆ నివేదిక ఆధారంగా ఆ ముగ్గురు పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. అదే సమయంలో అమాయకులపై పోలీసుల రాక్షసత్వ దాడిని వెలుగులోకి తీసుకురావడంలో సోషల్ మీడియాల పాత్రను గుర్తు చేస్తూ బెంచ్ ప్రశంసలు కురిపించడం విశేషం.
సెంగంలో విచారణ...!
వేలూరు: నడిరోడ్డులో పోలీసులు సాగించిన వీరంగంపై విచారణ ఆరంభమైంది. తిరువణ్ణామలై సబ్ కలెక్టర్ ఉమా మహేశ్వరి నేతృత్వంలో బృందం గురువారం సెంగంలో విచారణ జరిపారు. సంఘటన జరిగిన సమీపంలోని దుకాణాల వద్ద సుమారు 23 మంది వద్ద విచారణ చేపట్టి దుకాణదారులు ఇచ్చిన సమాచారాన్ని నమోదు చేసుకున్నారు. ఆమెతో పాటు తహసీల్దార్ కామరాజ్, డిప్యూటీ తహసీల్దార్ మలర్కొడి రెవెన్యూ అధికారులున్నారు. అదే విధంగా డీఎస్పీ షాజిత, పోలీసులతో వెళ్లి వేర్వేరుగా విచారణ జరిపారు. ఇరు బృందాలు విచారణ జరిపిన నివేదికలను కలెక్టర్ జ్ఞానశేఖరన్ వద్ద సమర్పించనున్నారు.