మళ్లీ ముగ్గురు స్పిన్నర్లు
మూడో టెస్టుకూ స్పిన్ పిచ్ సిద్ధం
నాగ్‌పూర్: దక్షిణాఫ్రికాపై మరోసారి భారత జట్టు స్పిన్ అస్త్రాన్ని సంధించబోతోంది. నాగ్‌పూర్‌లో జరిగే మూడో టెస్టుకు కూడా స్పిన్ పిచ్ సిద్ధమైంది. తొలి రోజు నుంచి బంతి తిరుగుతుందని క్యురేటర్ ఇప్పటికే చెప్పేశారు. దీంతో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగబోతోంది. అశ్విన్, జడేజాలతో పాటు అమిత్ మిశ్రా తుది జట్టులోకి రావొచ్చు. ఒకవేళ ఆల్‌రౌండర్ కావాలనుకుంటే గురుకీరత్ సింగ్‌ను తీసుకోవచ్చు.
బుధవారం నుంచి జరిగే ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే దక్షిణాఫ్రికాకు సిరీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. అయితే మొహాలీలో రెండు ఇన్నింగ్స్‌ల్లో స్పిన్నర్లకు దాసోహమన్న బ్యాట్స్‌మెన్... బెంగళూరులోనూ తొలి రోజే భారత స్పిన్నర్ల ధాటికి చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో ఆ జట్టు తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగుతుంది.
ఒత్తిడి పెంచాం: విజయ్
టెస్టు సిరీస్ తొలి రోజు నుంచే దక్షిణాఫ్రికా జట్టుపై ఒత్తిడి పెంచడంలో విజయం సాధించామని భారత ఓపెనర్ మురళీ విజయ్ చెప్పాడు. ‘మొహాలీలో విజయం, బెంగళూరులో తొలి రోజు పూర్తి ఆధిపత్యం కారణంగా మా జట్టు మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఏ విభాగంలోనూ సమస్యలు, ఆందోళన లేవు’ అని విజయ్ అన్నాడు. తాను ఆరంగేట్రం చేసిన మైదానంలో మరోసారి మ్యాచ్ ఆడబోతున్నందుకు సంతోషంగా ఉందని అన్నాడు.
స్టెయిన్ గురించి చెప్పలేం: మోర్కెల్
గాయంతో బాధపడుతున్న పేసర్ డేల్ స్టెయిన్ మూడో టెస్టుకు అందుబాటులో ఉండేదీ లేనిదీ చెప్పలేమని మరో పేసర్ మోర్నీ మోర్కెల్ చెప్పాడు. ‘స్టెయిన్ నెట్స్‌లో బౌలింగ్ చేయడం మొదలుపెట్టాడు. అయితే ఇంకా పూర్తిస్థాయిలో సౌకర్యంగా లేడు. బుధవారం ఉదయం 9 గంటల సమయానికి పూర్తి ఫిట్నెస్తో ఉంటే తను అందుబాటులో ఉంటాడు’ అని అన్నాడు.
ఐదే ళ్ల క్రితం ఇదే మైదానంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో స్టెయిన్ అద్భుతంగా రివర్స్ స్వింగ్ రాబట్టి మ్యాచ్‌లో పది వికెట్లు తీశాడు. ఈ సారి కూడా రివర్స్ స్వింగ్‌కు అవకాశం ఉందని దక్షిణాఫ్రికా భావిస్తోంది. సిరీస్‌లో వెనకబడి ఉన్నా ఆశావహ దృక్పథంతోనే ఉన్నామని మోర్కెల్ చెప్పాడు. ‘టెస్టుల్లో మేం ప్రపంచ నంబర్‌వన్ జట్టు. కొన్ని ఓట ములతో మా ఆత్మవిశ్వాసం దెబ్బతినదు. మూడో టెస్టును తాజాగా ప్రారంభిస్తాం. సిరీస్‌లో పుంజుకుం టామనే నమ్మకం ఉంది’ అని మోర్కెల్ అన్నాడు.