తను లేని జీవితం వద్దు.. నన్నూ చంపేయండి.!
సాక్షి, చెన్నై: తనకు చేస్తున్న మోసాన్ని భరించలేకే అశ్వినిని హతమార్చినట్టు నిందితుడు అళగేశన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. అశ్విని లేని జీవితం తనకు వద్దని, తననూ హతమార్చాలని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక, అళగేషన్ను ఉరి తీయాలని అశ్విని కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.
చెన్నైలో ప్రేమోన్మాది అళగేషన్(22) ఘాతకానికి శుక్రవారం అశ్విని(18) బలైన విషయం తెలిసిందే. ప్రజలు చితక్కొట్టడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అళగేషన్ ఆరోగ్యం శనివారం కుదుట పడింది. దీంతో ఉదయాన్నే పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టి అతడి వాంగ్మూలం తీసుకున్నారు. ఆ మేరకు ఆలపాక్కం ధనలక్ష్మి నగర్లో ఉన్నప్పుడు తొలిసారిగా అశ్వినిని చూసినట్టు పేర్కొన్నాడు. కొన్ని నెలలు ఆమె వెంట పడ్డానని, చివరకు తన ప్రేమను తెలియజేయడంతో అంగీకరించిదని తెలిపాడు. రెండేళ్లుగా తాను, అశ్విని ప్రేమించుకుంటున్నామని వివరించారు. ఆమెకు తండ్రి లేడని, తల్లి, సోదరుడు మాత్రమే ఉన్నట్టు చెప్పాడు. అందుకే తాను ఆమెను చదివించేందుకు కష్ట పడుతూ వచ్చానని పేర్కొన్నారు. రెండు లక్షల వరకు ఆమె చదువుల కోసం ఖర్చు పెట్టానని వివరించాడు.
అయితే, కాలేజీలో చేరిన అనంతరం తనను ప్రేమించేందుకు తగ్గ అర్హతలు ఉన్నాయా అని అశ్విని ప్రశ్నించడం భరించలేక పోయాయని పేర్కొన్నాడు. ఆమె తల్లి ఒత్తిడి మేరకే అలా చెప్పినట్టు భావించానని, పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేయడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్టు తెలిపాడు. తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదని భావించి ఆమెను హతమార్చిన మరుక్షణం తాను ఆత్మాహుతి చేసుకోవాలన్న లక్ష్యంతోనే కేకేనగర్కు వెళ్లడం జరిగిందన్నారు. అయితే, తనను అక్కడి జనం పట్టుకోవడంతో ఆత్మహత్య చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పాడు. ఇప్పుడు తనను చంపేయాలని లేకపోతే ఏదో ఒక రోజు ఆత్మహత్య చేసుకుంటానని వాపోయాడు. అశ్విని లేని జీవితం తనకు వద్దు అని బోరున విలపించాడు.
బయటకు వచ్చిన ఫిర్యాదు : గత నెల 16వ తేదీన అశ్విని మధురవాయిల్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు తాజాగా బయట పడింది. తాను అళగేషన్ ప్రేమించుకున్నట్టు వివరించిన అశ్విని, ఇప్పుడు అతడికి ఎలాంటి అర్హతలు లేదు అని, అందుకే దూరం పెట్టినట్టు ఆ ఫిర్యాదులో పేర్కొని ఉండడం గమనార్హం. ఈ సమయంలో పోలీసులు అళగేషన్కు బాగానే దేహశుద్ధి చేశారు. స్థానిక పెద్దల జోక్యంతో అళగేషన్ను హెచ్చరించి పంపించారు. అయితే, తనకు జరిగిన అవమానం, తనను మోసం చేసే విధంగా అశ్విని వ్యవహరించడాన్ని భరించ లేక హతమార్చి తీరాలన్న భావనతో వచ్చి తన పంతాన్ని అళగేషన్ నెగ్గించుకున్నాడు. తనకు దూరం అవుతున్న అశ్వినికి బలవంతంగా ఆ ప్రేమోన్మాది తాళి కట్టడం, దానిని ఆమె తెంచి పడేయడం వంటి ఘటనలు కూడా చోటుచేసుకుని ఉండడం గమనార్హం.
అళగేశన్ను చూసి భయపడి : కళాశాల గేటు వద్ద మిత్రులతో కలిసి బయటకు వచ్చిన అశ్విని సమీపంలో నక్కి ఉన్న అళగేషన్ను గుర్తించింది. మిత్రులతో కలిసి వెళ్లి ఉంటే ప్రాణాల్ని దక్కించుకునేదేమో. ఎక్కడ అళగేషన్ తన ముందుకు వస్తాడోనన్న భయంతో పక్కనే ఉన్న మరో వీధి వెంట పరుగులు తీసింది. దీన్ని గుర్తించిన కిరాతకుడు వెంట పడి మరీ ఆమె గొంతులో కత్తిని దించి హతమార్చాడు. ఈ హఠాత్పరిణామాన్ని అక్కడే ఉన్న కొందరు గుర్తించి అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది.
హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించేలోపు ఆమె విగతజీవిగా మారింది. అళగేషన్ వేధింపుల నేపథ్యంలో ప్రతిరోజూ తానే అశ్విని ఇంటికి తీసుకొచ్చే వాడిని అని, శుక్రవారం కాస్త ఆలస్యం కావడంతో ఆమెను పోగొట్టుకున్నట్టు ఆమె పెదనాన్న సంపత్ ఆవేదన వ్యక్తంచేశారు. అశ్విని చదువులకు తానేదో లక్షలు ఖర్చు పెట్టినట్టుగా నిందితుడు పేర్కొనడాన్ని ఆమె తల్లి శంకరి ఖండించారు. తాను అనేక ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటూ కుమార్తెను, కుమారుడ్ని చదివిస్తున్నట్టు వివరించారు. ఆస్పత్రిలో శనివారం పోస్టుమార్టం అనంతరం అశ్విని మృతదేహాన్ని తీసుకునేందుకు కుటుంబీకులు నిరాకరించారు. నిందితుడ్ని ఉరి తీయాలని, అప్పుడే మృతదేహాన్ని తీసుకుంటామని పట్టుబట్టారు. చివరకు పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బుజ్జగించారు. దీంతో మృతదేహాన్ని తీసుకున్న కుటుంబీకులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.