క్రీడలతో స్నేహ సంబంధాలు మెరుగు
నంద్యాల: క్రీడలతో స్నేహ సంబంధాలు మెరుగవుతాయని శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎంవీ సుబ్బారెడ్డి చెప్పారు. గురురాజ ఇంగ్లిష్ మీడియం స్కూల్ మైదానంలో జిల్లా స్థాయి త్రోబాల్ టోర్నమెంట్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి కాంస్య విగ్రహానికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ నాగనరసింహులు, గురురాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ దస్తగిరిరెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం చైర్మన్ డాక్టర్ రవికృష్ణ, బాల్ బ్యాడ్మింటన్ సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నపురెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రతి ఏడాది టోర్నమెంట్...
తండ్రి పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి జ్ఞాపకార్థం ప్రతి ఏడాది క్రీడా పోటీలతో పాటు, పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు గురురాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ దస్తగిరిరెడ్డి చెప్పారు. పోటీల్లో పాల్గొనడానికి విచ్చేసిన క్రీడాకారులకు భోజనం, ఇతర వసతులు కల్పిస్తున్నామన్నారు. డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. అనంతరం విద్యార్థుల శాస్త్రీయ, ఆధునిక నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గురురాజ విద్యాసంస్థల కో డైరెక్టర్లు షేక్షావలిరెడ్డి, మౌలాలిరెడ్డి పాల్గొన్నారు.