వాలెంటైన్స్ డే రోజు ప్రియుడి హత్య
న్యూఢిల్లీ: ప్రేమికుల రోజు నాడు ప్రియురాల్ని కలుసుకుందామని వచ్చిన ఓయువకుడు శవమై తేలాడు. ఢిల్లీకి చెందిన ఈశ్వర్ (27) ఫేస్బుక్లో పరిచయమైన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. వాలెంటైన్స డే సందర్భంగా ప్రేమికులిద్దరూ గుర్గావ్ లో కలుసుకున్నారు. ప్రియురాలిని తొలిసారి కలిసిన ఆనందం క్షణకాలం ముగియకుండానే ఆమె బంధువుల చేతిలో హత్యకు గురికావడం విషాదాన్ని నింపింది.
తీవ్రగాయాలతో ఒక యువకుడు తమ ఆసుపత్రిలో చేరినట్టుగా స్థానిక ఆసుపత్రి ఇచ్చిన సమాచారంతో పోలీసులు అప్రమత్తయ్యారు. కానీ వారు అక్కడికి చేరే లోపే ఈశ్వర్ ప్రాణాలు విడిచాడు. దీనిపై సుశాంత్ లోక్ పోలీసు స్టేషన్ అధికారులు ఆరా తీశారు. వారు అందించిన సమాచారం ప్రకారం..
ఈశ్వర్ ఏడునెలల క్రితం ఫేస్బుక్ లో పరిచయమైన అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమికుల రోజున ఇద్దరు ఒకరికొకరు ముఖాముఖి కలుసుకోవాలని నిర్ణయించుకుని మెట్రో రైల్వే స్టేషన్ లో మీట్ అయ్యారు. అనంతరం సుశాంత్ లోక్ ఏరియాలో ఉన్న బహుళ అంతస్తుల భవనంలోకి వెళ్లారు. వీరిని గమనించిన ఆమె బావ రమేష్ (30), అతని డ్రైవర్ అనిల్ కుమార్ (25) వాళ్లను ఫాలో అయ్యారు. ప్రేమికులిద్దరూ మాట్లాడుకుంటుండగా బావ రమేష్, ఈశ్వర్ తో వాదనకుదిగారు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఈశ్వర్ ను పైనుంచి కిందికి తోసేశారు. దీంతో తీవ్రగాయాలపాలైన ఈశ్వర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
తీవ్ర గాయాలపాలైన అతడిని కొంత దూరంకారులో తీసుకెళ్లి రోడ్డుపై పడేసారని పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నంలో భాగంగా అక్కడినుంచి వెళ్లిపోయారన్నారు. రమేష్, అనిల్ పై హత్యకేసు నమోదుచేశామని,దర్యాప్తు కొనసాగుతోందని గుర్గావ్ పోలీస్ అధికారి దీపక్ తెలిపారు.