సీఎం.. ఆ మాట ఎందుకన్నారు: హైకోర్టు
‘తుల్లా’ అనే పదం ఎందుకు వాడారు, ఆ పదానికి అర్థం ఏంటో వివరించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. స్థానిక పోలీసు కానిస్టేబుల్ ఒకరిపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల విషయంలో ఆయనపై పరువునష్టం దావా దాఖలైంది. ఆ దావా నేపథ్యంలో కేజ్రీవాల్‌కు దిగువ కోర్టు జారీచేసిన సమన్లపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే, తుల్లా పదానికి అర్థం ఏంటో తదుపరి విచారణ రోజున వివరించాలని ఆదేశించింది.
అజయ్ కుమార్ తనేజా అనే కానిస్టేబుల్ తనను కేజ్రీవాల్ తిట్టారని, నగర పోలీసులను వివరించడానికి ఆయన ‘తుల్లా’ అనే పదం ఉపయోగించారని అరోపిస్తూ కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు. ఒక వార్తా చానల్‌తో మాట్లాడుతూ కేజ్రీవాల్ ఆ పదం ఉపయోగించారని, అది చాలా తూలనాడే పదం అని చెప్పారు. ఢిల్లీ పోలీసుల గురించి చెప్పేందుకు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలాంటి మాటలు ఉపయోగిస్తే ఇక సామాన్య ప్రజలకు పోలీసు సిబ్బంది అంటే ఏం గౌరవం ఉంటుందని తనేజా అన్నారు.