నందిగామలో రైతు అదృశ్యం కలకలం
నందిగామ: కృష్ణా జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లిలో పొలానికి వెళ్లిన రైతు కనిపించకుండా పోవటంతో కలకలం రేపింది. గ్రామానికి చెందిన తుమ్మల ప్రసాద్(38) రెండెకరాల పొలం కౌలుకు తీసుకుని పంటలు సాగు చేశాడు. వ్యవసాయానికి రోజూ తెల్లవారుజామున త్రీఫేజ్ కరెంట్ వస్తుంది. దీంతో మంగళవారం వేకువజామున ప్రసాద్ తన బైక్‌పై పొలానికి బయలుదేరాడు. పొలానికి కొద్ది దూరంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిని అటకాయించి ఎత్తుకుపోయారు. ఆ ప్రదేశంలో అతని చెప్పులు, దుప్పటి, కండువా పడి ఉన్నాయి. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
వారు అతని జాడ కోసం గాలించినా ఫలితం లేకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, అక్కడికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు వద్ద రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం పడి ఉన్న విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. అయితే, మృతదేహం ఛిద్రమై గుర్తుపట్టే వీలు లేకుండా ఉంది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ప్రసాద్‌ను ఎవరు తీసుకెళ్లారు అనేది తేలాల్చి ఉంది.