వారసత్వ బదిలీల్లో జాప్యమెందుకు?
తహసీల్దారుపై మంత్రి తుమ్మల ఆగ్రహం
గండుగులపల్లి (దమ్మపేట): ‘‘వారసత్వ భూబదలాయింపుల్లో ఎందుకు జాప్యం జరుగుతోంది?ఎక్కడా లేని సమస్యలు ఇక్కడే ఎందుకు వస్తున్నాయి? రైతులకు ఈ–పహణీ, 1బి పాస్ పుస్తకాలు ఇవ్వకపోతే ఎలా?’’ అని, దమ్మపేట తహసీల్దార్ కేవీ శ్రీనివాసరావుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి తుమ్మలను గండుగులపల్లిలోని ఆయన నివాసంలో మంగళవారం జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, టీఆర్ఎస్ నాయకులు కలిశారు. ముందుగా, దమ్మపేట తహసీల్దార్ కేవీ శ్రీనివాసరావును మంత్రి పిలిచారు. ఆ సమయంలో ఆయన లేరు. కొద్దిసేపటి తర్వాత వచ్చి కలిశారు. ‘‘తహసీల్దార్ కార్యాలయంలో సమస్యలు పరిష్కారమవడం లేదని రైతుల నుంచి నిత్యం ఫిర్యాదులు వస్తున్నాయి. అర్హులైన రైతుల వారసత్వ బదలాయింపులు, పాస్ పుస్తకాల జారీలో నెలల తరబడి ఎందుకు జాప్యం చేస్తున్నారు?’’ అని ఒకింత ఆగ్రహంతో ప్రశ్నించారు. ఆన్లైన్ ప్రక్రియను వెంటనే వేగవంతం చేయాలని ఆదేశించారు. ‘‘ఇక నుంచి మీ కార్యాలయంపై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా సహించేది లేదు’’ అని హెచ్చరించారు. మంత్రిని కలిసిన వారిలో టీఆర్ఎస్ నాయకులు పైడి వెంకటేశ్వరరావు, దొడ్డాకుల రాజేశ్వరరావు, పోతినేని శ్రీరామవెంకటరావు, కేవీ సత్యనారాయణ, బండి పుల్లారావు, చల్లగుళ్ల నరసింహారావు, రెడ్డిమళ్ల వెంకటేశ్వరరావు, పానుగంటి రాంబాబు, కురిశెట్టి సత్తిబాబు, కాసాని నాగప్రసాద్ తదితరులు ఉన్నారు.