Ticket machines
-
టికెట్ చిక్కు.. టిమ్స్‌తో చెక్!
►రామంతాపూర్‌కు చెందిన శ్రీనివాస్ అత్యవసరంగా విజయవాడకు వెళ్లాల్సి వచ్చి, ఆన్లైన్లో ఆర్టీసీ గరుడ ప్లస్ బస్ రిజర్వేషన్ కోసం యత్నించాడు. తాను ఎంచుకున్న సమయానికి ఉన్న బస్సు అప్పుడే కూకట్పల్లి నుంచి బయలుదేరింది. దీంతో ఆన్లైన్ రిజర్వేషన్ మూసుకుపోయింది. తదుపరి గరుడ బస్సు మరో రెండు గంటల తర్వాతకానీ లేదు. దీంతో ప్రైవేటు బస్సెక్కి వెళ్లిపోయాడు. కానీ కూకట్‌పల్లిలో బయలుదేరిన బస్సు పది ఖాళీ సీట్లతో విజయవాడకు వెళ్లింది. ►నగరానికి పనిమీద వచ్చిన బెంగళూరు వాసి దత్త తిరుగుప్రయాణంలో ఆరాంఘర్ కూడలి వద్ద ఆర్టీసీ బస్కెక్కాడు. కానీ టికెట్‌కు చాలినంత డబ్బులు జేబులో లేకపోవటం, గూగుల్‌పే లాంటి వాటితో టికెట్ ఇచ్చే వీలులేక బస్సు దిగిపోవాల్సి వచ్చింది. అయితే ఇకపై ఇలాంటి కష్టాలకు ఆర్టీసీ చెక్ పెట్టనుంది. సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో ఇంటెలిజెన్స్ టికెట్ ఇష్యూయింగ్ మెషీన్స్ (ఐ–టిమ్స్) అందుబాటులోకి రాబోతున్నాయి. ఇంటర్నెట్, జీపీఎస్‌తో అనుసంధానమయ్యే ఈ యంత్రాలతో.. ప్రస్తుతం నెలకొన్న ఎన్నో సమస్యలు తొలగిపోనున్నాయి. ప్రస్తు తం ప్రయాణికుడు నగదు చెల్లిస్తేనే టికెట్ జారీ అవుతోంది. కానీ ఫోన్ పే, పేటీఎం లాంటి యూపీఐ చెల్లింపుల విధానం అందుబాటులో లేదు. టికెట్‌కు సరిపడా డబ్బులు జేబులో లేని వారు బస్సు దిగిపోవటం మినహా మరో మార్గం లేదు. ఈ ఐ–టిమ్స్ యంత్రాలు అందుబాటులోకి వస్తే, అన్ని రకాల పద్ధతుల్లో చెల్లింపులు జరపొచ్చు. ప్రస్తుతం చాలా మంది ఫోన్లలో గూగుల్ పే, పేటీఎం లాంటి యూపీఐ ఆప్షన్స్ ఉంటు న్నాయి. ఇక డెబిట్ కార్డుతో స్వైప్ చేయటం ద్వారా ఆన్లైన్ లావాదేవీలు జరుపుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో టికెట్ కొనేందుకు ఈ విధానం ఇంతకాలం అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎండీ సజ్జనార్ దృష్టికి వెళ్లటంతో ఇటీవల ఆయన అధికారులతో చర్చించి ఇంటెలిజెన్స్ టికెట్ జారీ యంత్రాలు సమకూర్చాలని నిర్ణయించారు. ఒక్కక్కటి రూ. 16 వేలు ఖరీదుచేసే వేయి యంత్రాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చారు. మరో నాలుగైదు రోజుల్లో అవి అందుబాటులోకి రానున్నాయి. ముందు వాటిని దూరప్రాంత సర్వీసుల్లో అందుబాటులో ఉంచి, ఆ తర్వాత అన్ని బస్సుల్లో ఏర్పాటు చేయనున్నారు. తీరనున్న రిజర్వేషన్ సమస్య.. దూర ప్రాంత సర్వీసుల టికెట్లను ఆన్లైన్లో, ఫోన్లో యాప్ ద్వారా ప్రయాణికులే బుక్ చేసుకుని సమయానికి ఆ ప్రాంతానికి వెళ్లి బస్సు ఎక్కుతున్నారు. ప్రస్తుత విధానం లోపభూయిష్టంగా ఉంది. ఆ బస్సు పాయింట్లో బయలుదేరగానే ఆన్లైన్ రిజర్వేషన్ ఆగిపోతుంది. బస్సులో నేరుగా డ్రైవర్‌కు డబ్బులిచ్చి టికెట్ కొనడమే తప్ప రిజర్వ్ చేసుకునే వీల్లేదు. కొత్తగా వచ్చే ఐ–టిమ్స్ వల్ల బస్సు బయలుదేరాక కూడా రిజర్వేషన్‌కు వీలుంటుంది. ఉదాహరణకు బీహెచ్ఈఎల్ పాయింట్ నుంచి బయలుదేరిన బస్సు ఆ తర్వాత కూడా ఆన్లైన్లో కనిపిస్తుంది. ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో తెలుస్తుంది. బస్సు ఎక్కడ ఉందో యాప్‌లో కనిపిస్తుంది. దీంతో అత్యవసరంగా వెళ్లాల్సిన వారు అప్పటికప్పుడు సీట్ రిజర్వ్ చేసుకుని ఆ బస్సును అందుకోవచ్చు. ఇంతకాలం ఈ విధానం లేక చాలా బస్సులు ఖాళీ సీట్లతోనే పరుగులు పెడుతున్నాయి. దీన్ని గుర్తించి బస్సులు ప్రయాణంలో ఉన్నా ఆన్లైన్ రిజర్వేషన్ చార్టులో అది కనిపించేలా టిమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. జీపీఎస్ అనుసంధానంతో బస్సును ట్రాక్ చేసే వెసులుబాటు కలగనుంది. -
ఆర్టీసీలో పనిచేయని టిక్కెట్ జారీ మిషన్లు
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : ఆర్టీసీలో ప్రవేశపెట్టిన టిక్కెట్ జారీ మిషన్లు మొరాయిస్తున్నాయి. కండక్టర్లు ప్రయాణికులకు టిక్కెట్లు సులువుగా జారీ చేయడానికి ఇచ్చిన మిషన్లు ముణ్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. దాదాపు 75 శాతం మిషన్లు పనిచేయడం లేదు. రూ. లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన మిషన్లు వృథాగా అవుతున్నాయి. ఆర్టీసీ రీజినల్ వ్యాప్తంగా ఆరు డిపోలు ఉన్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఉట్నూర్, భైంసా, మంచిర్యాల, నిర్మల్‌లలో డిపోలు ఉన్నాయి. వీటిలో 643 టిక్కె ట్ జారీ మిషన్లు ఉన్నాయి. ఇందులో 604 మాత్రమే అవసరం. ఇంకా 39 మిషన్లు అదనంగా ఉన్నాయి. ఇందులో డ్రైవర్లు టిక్కెట్ ఇచ్చే మిషన్లు(అనలాజీకల్) 99, కండక్టర్, డ్రైవర్ ఇద్దరూ వినియోగించే మిషన్లు(మైక్రో ఎఫెక్స్) 544 ఉన్నాయి. సగానికి పైగా చెడిపోయిన టిక్కెట్ జారీ మిషన్లు 2010 సంవత్సరంలో సులువుగా టిక్కెట్స్ జారీ చేయడానికి టిక్కెట్ జారీ మిషన్లను ఆర్టీసీ ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి కొంతకాలం సజావుగా పనిచేశాయి. అనంతరం ఏడాది కూడా పనిచేయలేదు. దాదాపు సగానికిపైగా మిషన్లు మరమ్మతుకు వచ్చా యి. బ్యాటరీలు నాణ్యతగా లేకపోవడం, చార్జింగ్ ఆగకపోవడం, అకస్మాత్తుగా ఆగిపోవడం తదితర కారణాలతో మూలనపడ్డాయి. ఇలా పనిచేయకపోవడంతో కండక్టర్లు పాత పద్ధతిలోనే టిక్కెట్లు జారీ చేస్తున్నారు. మిషన్ ద్వారా టిక్కెట్ల జారీ సులువుగా ఉండేదని, లగ్జరీ, ఇంద్ర, గరుడ బస్సులకు కండక్టర్లు లేకుండా డ్రైవర్లే మిషన్ల ద్వారా టిక్కెట్ ఇచ్చేవారు. మిషన్లు పనిచేయకపోవడంతో మళ్లీ భారం పడిం దని కండక్టర్లు ఆవేదన చెందుతున్నారు. టిక్కెట్ జారీ మిషన్ ద్వారా ఏ స్టాపులో ఎంత మంది దిగారు.. బస్సులో ఎంత మంది ఉన్నారు.. మొత్తం కలెక్షన్ ఎంత అనేవి సులువుగా తెలిసేవి. కండక్టరుకు ప్రయోజనకరంగా ఉండేది. దొరకని విడిభాగాలు మైక్రో ఎఫెక్స్ కంపెనీ నిర్వాహకులు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డీఎం కార్యాలయంలో మిషన్ల మరమ్మతు కోసం ఒక దుకాణాన్ని ఏర్పాటు చేశారు. అయినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. కంపెనీ నిర్వాహకులు ఆర్టీసీలోనే ఒక కార్మికునికి శిక్షణ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కానీ, మరమ్మతు చేసే గది ఎప్పుడు కూడా తాళం వేసి ఉంటుంది. రిపేరింగ్ జరగడం లేదు. టిక్కెట్ జారీ మిషన్ల విడిభాగాలు లభించకపోవడంతో మూలన పడుతున్నాయి. చర్యలు తీసుకుంటున్నాం.. - వెంకటేశ్వర్లు, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జిల్లాలోని టిక్కెట్ జారీ మిషన్లు మొరాయిస్తున్న విషయం నాకు తెలిసింది. మిషన్లు మృదువుగా ఉండటంతో వినియోగించక రాక పాడవుతున్నాయి. మరమ్మతుకు వచ్చిన మిషన్ల కోసం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ఒక ఎలక్ట్రికల్ సిబ్బందికి రిపేరింగ్పై శిక్షణ ఇప్పించాం. ఇబ్బందులు కలుగకుండా చూస్తాం.