►రామంతాపూర్‌కు చెందిన శ్రీనివాస్ అత్యవసరంగా విజయవాడకు వెళ్లాల్సి వచ్చి, ఆన్‌లైన్‌లో ఆర్టీసీ గరుడ ప్లస్ బస్ రిజర్వేషన్ కోసం యత్నించాడు. తాను ఎంచుకున్న సమయానికి ఉన్న బస్సు అప్పుడే కూకట్‌పల్లి నుంచి బయలుదేరింది.
దీంతో ఆన్‌లైన్ రిజర్వేషన్ మూసుకుపోయింది. తదుపరి గరుడ బస్సు మరో రెండు గంటల తర్వాతకానీ లేదు. దీంతో ప్రైవేటు బస్సెక్కి వెళ్లిపోయాడు. కానీ కూకట్‌పల్లిలో బయలుదేరిన బస్సు పది ఖాళీ సీట్లతో విజయవాడకు వెళ్లింది.
►నగరానికి పనిమీద వచ్చిన బెంగళూరు వాసి దత్త తిరుగుప్రయాణంలో ఆరాంఘర్ కూడలి వద్ద ఆర్టీసీ బస్కెక్కాడు. కానీ టికెట్‌కు చాలినంత డబ్బులు జేబులో లేకపోవటం, గూగుల్‌పే లాంటి వాటితో టికెట్ ఇచ్చే వీలులేక బస్సు దిగిపోవాల్సి వచ్చింది. అయితే ఇకపై ఇలాంటి కష్టాలకు ఆర్టీసీ చెక్ పెట్టనుంది.
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో ఇంటెలిజెన్స్ టికెట్ ఇష్యూయింగ్ మెషీన్స్ (ఐ–టిమ్స్) అందుబాటులోకి రాబోతున్నాయి. ఇంటర్నెట్, జీపీఎస్‌తో అనుసంధానమయ్యే ఈ యంత్రాలతో.. ప్రస్తుతం నెలకొన్న ఎన్నో సమస్యలు తొలగిపోనున్నాయి. ప్రస్తు తం ప్రయాణికుడు నగదు చెల్లిస్తేనే టికెట్ జారీ అవుతోంది. కానీ ఫోన్ పే, పేటీఎం లాంటి యూపీఐ చెల్లింపుల విధానం అందుబాటులో లేదు. టికెట్‌కు సరిపడా డబ్బులు జేబులో లేని వారు బస్సు దిగిపోవటం మినహా మరో మార్గం లేదు.
ఈ ఐ–టిమ్స్ యంత్రాలు అందుబాటులోకి వస్తే, అన్ని రకాల పద్ధతుల్లో చెల్లింపులు జరపొచ్చు. ప్రస్తుతం చాలా మంది ఫోన్‌లలో గూగుల్ పే, పేటీఎం లాంటి యూపీఐ ఆప్షన్స్ ఉంటు న్నాయి. ఇక డెబిట్ కార్డుతో స్వైప్ చేయటం ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలు జరుపుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో టికెట్ కొనేందుకు ఈ విధానం ఇంతకాలం అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఎండీ సజ్జనార్ దృష్టికి వెళ్లటంతో ఇటీవల ఆయన అధికారులతో చర్చించి ఇంటెలిజెన్స్ టికెట్ జారీ యంత్రాలు సమకూర్చాలని నిర్ణయించారు. ఒక్కక్కటి రూ. 16 వేలు ఖరీదుచేసే వేయి యంత్రాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చారు. మరో నాలుగైదు రోజుల్లో అవి అందుబాటులోకి రానున్నాయి. ముందు వాటిని దూరప్రాంత సర్వీసుల్లో అందుబాటులో ఉంచి, ఆ తర్వాత అన్ని బస్సుల్లో ఏర్పాటు చేయనున్నారు.
తీరనున్న రిజర్వేషన్ సమస్య..
దూర ప్రాంత సర్వీసుల టికెట్లను ఆన్‌లైన్‌లో, ఫోన్‌లో యాప్ ద్వారా ప్రయాణికులే బుక్ చేసుకుని సమయానికి ఆ ప్రాంతానికి వెళ్లి బస్సు ఎక్కుతున్నారు. ప్రస్తుత విధానం లోపభూయిష్టంగా ఉంది. ఆ బస్సు పాయింట్‌లో బయలుదేరగానే ఆన్‌లైన్ రిజర్వేషన్ ఆగిపోతుంది. బస్సులో నేరుగా డ్రైవర్‌కు డబ్బులిచ్చి టికెట్ కొనడమే తప్ప రిజర్వ్ చేసుకునే వీల్లేదు. కొత్తగా వచ్చే ఐ–టిమ్స్ వల్ల బస్సు బయలుదేరాక కూడా రిజర్వేషన్‌కు వీలుంటుంది.
ఉదాహరణకు బీహెచ్‌ఈఎల్ పాయింట్ నుంచి బయలుదేరిన బస్సు ఆ తర్వాత కూడా ఆన్‌లైన్‌లో కనిపిస్తుంది. ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో తెలుస్తుంది. బస్సు ఎక్కడ ఉందో యాప్‌లో కనిపిస్తుంది. దీంతో అత్యవసరంగా వెళ్లాల్సిన వారు అప్పటికప్పుడు సీట్ రిజర్వ్ చేసుకుని ఆ బస్సును అందుకోవచ్చు.
ఇంతకాలం ఈ విధానం లేక చాలా బస్సులు ఖాళీ సీట్లతోనే పరుగులు పెడుతున్నాయి. దీన్ని గుర్తించి బస్సులు ప్రయాణంలో ఉన్నా ఆన్‌లైన్ రిజర్వేషన్ చార్టులో అది కనిపించేలా టిమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. జీపీఎస్ అనుసంధానంతో బస్సును ట్రాక్ చేసే వెసులుబాటు కలగనుంది.
Comments
Please login to add a commentAdd a comment